వీధి
జామ చెట్టు గుబుర్ల మధ్య
తాంబూలమేసిన మరుతేజి
మందార చాపానికి కట్టిన
వరికంకి దుబ్బులకోసం
వచ్చే గిజిగాడు
తుమ్మముల్లుకి తాటాకు రెక్కల్ని
పంకాగా గుచ్చి
పరుగులెత్తిన వీధులు
తాటిముంజెల రథంతో
రేసులాడిన వీధులు
దుర్భిణితో వేసే సినిమాకి
ఫిలిం కట్టలకోసం
మేమంతా ఎగబడిన
వీధి మొగదలి
బ్రహ్మం కొట్టు
చింత చెట్టు రొబ్బలకి కట్టిన
అరల ముంతల్ని
కాటిబెల్లతో
గురిపెట్టి కొట్టిన
దెబ్బలు
వేసవి పొద్దుల్లో
చుక్కల్ని లెక్కిస్తూ
ఆరుబయట పర్యంకం మీది నిద్ర
తట్లీతో గోళీని కొట్టలేక
ఉట్లీ పెట్టేసి
సయాముల కన్నేలాట
జారిపోయే నిక్కరుని ఎగదోస్తూ
ఫైవ్ మార్క్ అగ్గిపెట్టె బచ్చాలకు
తిరిగిన రికామీ తిరుగుళ్లు
పందిరిపై జమ్ముగడ్డికి
తిరుగాడిన కోటిమెరక గట్లు
చేసిన కోనేటి స్నానాలు
వాన పడ్డాక వచ్చిన
మద్దేనపు సెలవుతో
బడిలో తిప్పిన
మట్టి బొంగరాలు
ఇవన్నీ
చక్కటి ఊరేకాదు
చిక్కటి జ్ఞాపకాలు కూడా
నట్టింట్లో పడకేసిన
టీవీల గోల తప్ప
ఇప్పుడీ
ఆటల్లేవు
-అరుణ్ మరపట్ల
Arun Kumar Marapatla
No comments:
Post a Comment