Thursday, August 31, 2023

విద్యా రుణాలు- అరుణ్‌ కుమార్‌ మరపట్ల-By Arun Kumar Marapatla

Vidya-05.02.2015 This Programme is telecasted in 6Tv telugu on 05.02.2015 Education Loans-Vidya- ఉన్నత విద్య (Higher Education).. వ్యక్తుల ప్రగతికే కాదు.. జాతి నిర్మాణానికి, పురోగతికి బలమైన పునాది. అలాంటి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆర్థిక స్తోమత లేకపోవడమనేది అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం.. అర్హులైన విద్యార్థులందరికీ విద్యా రుణాలు అందించాలని బ్యాంక్‌లను ఆదేశించింది. ఇలాంటి విద్యా రుణాల మంజూరుకయ్యే ఖర్చును మానవ వనరుల అభివృద్ధికి పెట్టే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే గత దశాబ్ద కాలంగా రుణాల మంజూరు ప్రక్రియను సరళీకృతం చేస్తూ వస్తోంది. రుణాలకు ఎవరు అర్హులు?  భారతదేశంలోగానీ, విదేశాల్లోగానీ ఉన్న విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన భారత జాతీయ విద్యార్థులకు టెర్మ్ లోన్ రూపంలో విద్యా రుణాలు మంజూరు చేస్తారు.  యూజీసీ/ఏఐసీటీఈ/ప్రభుత్వ అనుమతి పొందిన కళాశాల లేదా విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీటు సంపాదించిన విద్యార్థులు రుణాలకు అర్హులు.  ఐఐటీ/ఐఐఎం వంటి ఉన్నతస్థాయి విద్యా సంస్థల్లో డిగ్రీ లేదా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందిన వారు కూడా అర్హులు.  డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేదా షిప్పింగ్ శాఖ అనుమతి పొందిన ఏరోనాటికల్ కోర్సులు, పైలట్ శిక్షణ, షిప్పింగ్ కోర్సులను కూడా విద్యా రుణాలకు పరిగణనలోకి తీసుకుంటారు.  కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి పొందిన టీచర్ ట్రైనింగ్, నర్సింగ్ కోర్సులు రుణాలకు అర్హమైనవి.  దూరవిద్యా కోర్సులు, పార్ట్ టైం కోర్సుల్లో ప్రవేశించిన వారికి విద్యా రుణాలు మంజూరు చేయరు. ఎంత ఇస్తారు? విద్యార్థులు ప్రవేశం పొందే విద్యాసంస్థల్లో చెల్లించాల్సిన ట్యూషన్ ఫీజు, లేబొరేటరీ ఫీజు, పరీక్ష ఫీజు, యూనిఫాం, పుస్తకాలు, చదువుకు అవసరమైన ఉపకరణాలు, అవసరమైతే కంప్యూటర్ (ట్యూషన్ ఫీజులో 20 శాతానికి మించకుండా), కాషన్ డిపాజిట్/రిఫండబుల్ డిపాజిట్ (ట్యూషన్ ఫీజులో పది శాతానికి మించకుండా)లకు అయ్యే మొత్తాన్ని విద్యా రుణం మంజూరు చేసేందుకు పరిగణనలోకి తీసుకుంటారు. రూ. 50 వేల వరకు ద్విచక్ర వాహనం కొనుగోలును విద్యారుణంగా పరిగణిస్తారు. చదువు పూర్తిచేసేందుకు అవసరమైన ప్రాజెక్ట్ వర్క్, స్టడీ టూర్‌లకు అయ్యే ఖర్చులను కూడా మొత్తం ఖర్చులో కలపవచ్చు.  చదువుకోసం విదేశాలకు వెళ్లేవారు ప్రయాణ ఖర్చులను రుణం మొత్తంలో భాగంగా చూపించవచ్చు. విద్యార్థి కుటుంబంతో కలిసి ఉండకుండా వేరే ఊరిలో ఉండాల్సి వస్తే హాస్టల్ ఖర్చులు లేక సొంతంగా ఉండేందుకు అయ్యే ఖర్చులన్నీ చదువుకు అయ్యే ఖర్చుగానే పరిగణించి ఆ మేరకు రుణాన్ని మంజూరు చేస్తారు.  భారతదేశంలో చదువుకైతే రూ. 10 లక్షల వరకు, విదేశాల్లో చదువుకైతే రూ. 30 లక్షల వరకు విద్యా రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణాలకు ప్రాసెసింగ్ చార్జీలు ఉండవు. ఆషామాషీగా దరఖాస్తు చేసే విద్యార్థులను నిరుత్సాహ పరిచేందుకు విదేశాల్లో చదువుకోసం రుణాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల నుంచి రూ.5 వేలు డిపాజిట్ కట్టిస్తారు. రుణం తీసుకునేటప్పుడు ఆ డిపాజిట్‌ను వారి మార్జిన్‌గా పరిగణిస్తారు. ఏ కారణం వల్లనైనా రుణం మంజూరయ్యాక తీసుకోకుంటే ఆ డిపాజిట్‌ను ప్రాసెసింగ్ చార్జీగా పరిగణించి తీసుకుంటారు. ఎప్పుడు తిరిగి చెల్లించాలి? చదువు పూర్తయ్యాక ఒక సంవత్సరం లేక ఉద్యోగం వచ్చాక ఆర్నెల్లు.. ఈ రెండింటిలో ఏది ముందు జరిగితే అప్పటి నుంచి రుణ చెల్లింపులు ప్రారంభించాలి. చదువుకునే సమయంలో తల్లిదండ్రులు ప్రతినెలా క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు వడ్డీ కట్టినట్లయితే వడ్డీలో 1 శాతం తగ్గిస్తారు. రుణ పరిమాణాన్ని బట్టి 11.55 శాతం నుంచి 13.55 శాతం వరకు వడ్డీని సాలీనా వసూలు చేస్తారు. ఈ వడ్డీ రేట్లు స్థిరంగా ఉండవు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలకనుగుణంగా మారుతూ ఉంటాయి.  విద్యా రుణాలపై తిరిగి చెల్లించే వడ్డీ మొత్తానికి సెక్షన్ 80 (ఈ) కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. 2.3.2009 తర్వాత మంజూరైన రుణాల్లో మహిళా విద్యార్థులకు ఉపయోగించిన రుణాలకు 0.5 శాతం వడ్డీ తగ్గింపు వర్తిస్తుంది.  నాలుగు లక్షల రుణం వరకు మార్జిన్ అవసరం లేదు. అంటే చదువుకి అవసరమైన మొత్తం నాలుగు లక్షలకు మించకుంటే మొత్తం డబ్బును రుణంగా పొందవచ్చు. అంతకుమించితే మాత్రం భారత్‌లో చదువుకు 5 శాతం, విదేశాల్లో చదువుకు 15 శాతం మార్జిన్ భరించాల్సి ఉంటుంది.  రూ. నాలుగు లక్షల వరకు విద్యా రుణాలకు విద్యార్థి, తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు కలిసి సంబంధిత డాక్యుమెంట్లపై సంతకాలు చేస్తే సరిపోతుంది. ఎలాంటి కొల్లేటరల్ సెక్యూరిటీ అవసరం లేదు. రూ. 4 లక్షల నంచి రూ. ఏడున్నర లక్షల వరకు పై ఇద్దరితో పాటు ఎవరైనా హామీదారుగా ఉంటే సరిపోతుంది. ఇంకెలాంటి కొల్లేటరల్ అవసరం లేదు.  ఏడున్నర లక్షలకు పైన రుణాలకు మాత్రం భూమి, భవనాలు వంటి కొల్లేటరల్ సెక్యూరిటీ అవసరం.  ఏడున్నర లక్షల లోపు రుణాలను 5.7 సంవత్సరాల వ్యవధిలోనూ, అంతకు మించిన రుణాలను 12 ఏళ్ల వ్యవధిలోనూ తిరిగి కట్టాలి. సమర్పించాల్సిన డాక్యుమెంట్లు: విద్యా రుణాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన పత్రాల గురించి తెలుసుకుందాం. చదవదలచుకున్న విద్యా సంస్థలో ప్రవేశం కల్పించే ఉత్తరం, పదో తరగతి నుంచి అన్ని పరీక్షల మార్కుల పత్రాలు, కాలేజీలో కట్టాల్సిన ఫీజుల వివరాలు, హాస్టల్లో కట్టాల్సిన డబ్బు వివరాలు, 2 పాస్‌పోర్ట్ ఫొటోలు (విద్యార్థి/తల్లి/తండ్రి/హామీదారు), పాన్ కార్డు (విద్యార్థి, తల్లి/తండ్రి, గత ఆర్నెల్ల బ్యాంక్ స్టేట్‌మెంట్స్, గత రెండేళ్ల ఐటీ రిటర్న్‌లు, స్టేట్‌మెంట్ ఆఫ్ ఎసెట్స్ అండ్ లయబిలిటీస్, ఆదాయపు రుజువు (ప్లే స్లిప్పులు/ఫారం 16 వంటివి) జతపరిచి రుణ దరఖాస్తు ఇవ్వాలి. కేవైసీకి సంబంధించి ఐడీ రుజువు, అడ్రస్ రుజువులు జతపర్చాలి.  కొన్ని సందర్భాల్లో రుణం తీసుకొని చదివిన చదువు పూర్తయ్యాక, మరింత మంచి ఉద్యోగావకాశాల కోసం ఇంకా ఉన్నత విద్య చదవాలనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో అదే బ్యాంక్ నుంచి రెండో విద్యారుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాంటి వాటిని టాప్ అప్ రుణాలుగా వ్యవహరిస్తారు. రెండో రుణానికి సంబంధించిన చదువు పూర్తయ్యే వరకు మొదటి రుణానికి సంబంధించిన తిరిగి చెల్లింపును వాయిదా వేస్తారు. రెండో కోర్సు పూర్తయ్యాక రెండు రుణాలూ ఒకేసారి తిరిగికట్టడం ప్రారంభించవచ్చు. Digital Literacy-Vidya ప్రపంచం మొత్తం డిజిటల్ యుగం దిశగా దూసుకెళ్తోంది. అందివస్తున్న సాంకేతికత, చౌక ధరలకే లభ్యమవుతున్న ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్‌తో నవతరం డిజిటల్ వైపు మొగ్గుచూపుతోంది. రాబోయే కాలంలో విద్య, ఉద్యోగ సంబంధిత అంశాలతోపాటు ప్రభుత్వ పథకాలు, దైనందిన కార్యకలాపాలను అధిక శాతం డిజిటల్ మాధ్యమమే శాసించే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అందరూ సాంకేతిక సాధికారత సాధించేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమమే.. నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్(ఎన్‌డీఎల్‌ఎం). తద్వారా పట్టణాలు, గ్రామాల్లోని యువత ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు. 2015 చివరి నాటికల్లా 10 లక్షల మందికి డిజిటల్ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఈ శిక్షణ ద్వారా ప్రయోజనాలపై ఫోకస్... డిజిటల్ లిటరసీ అంటే.. అందరూ కంప్యూటర్ పరిజ్ఞానం అనుకుంటారు. వాస్తవానికి కావాల్సిన సమాచారాన్ని ఉపయోగించడం, నిక్షిప్తం చేయడం, విశ్లేషించే క్రమంలో డిజిటల్ సాంకేతికత, కమ్యూనికేషన్ టూల్స్/నెట్‌వర్క్‌ను ప్రభావవంతంగా వినియోగించే సామర్థ్యాన్ని కలిగి ఉండడమే డిజిటల్ లిటరసీ. వివరంగా చెప్పాలంటే.. సంప్రదాయ కంప్యూటర్లతోపాటు పీసీ, ల్యాప్‌టాప్ వంటి వాటి వినియోగంపై అవగాహన, కంప్యూటర్‌కు సంబంధించిన ప్రాథమిక పరికరాలపై పనిచేసే నేర్పు, కంప్యూటర్ నెట్‌వర్క్స్, ఈ-మెయిల్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ వంటివి వాడే విధానంపై స్పష్టత, కొన్ని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ల వినియోగం వంటి అంశాల్లో నైపుణ్యాన్ని కలిగి ఉండటమే డిజిటల్ లిటరసీ. 2020 నాటికి.. ప్రపంచ డిజిటల్ ఎకానమీలో భారతదేశం అగ్రభాగాన నిలిచేలా నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ దోహదపడుతుంది. రూరల్, అర్బన్ ప్రాంతాల ప్రజలు సాంకేతికంగా సాధికారత సాధించేలా చూడడమే దీని ప్రధాన ఉద్దేశం. డిజిటల్ సాంకేతికతతో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, ఈ-గవర్నెన్స్ ప్రాజెక్ట్‌లలో ప్రజలు చురుగ్గా పాల్గొనేలా చూడడం కూడా మరో లక్ష్యం. అంతేకాకుండా దేశంలోని గ్రామ పంచాయితీలను కూడా డిజిటల్ మాధ్యమం ద్వారా అనుసంధానించే కార్యక్రమం సైతం కొనసాగుతోంది. ఈ క్రమంలో 2020 నాటికి ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా డిజిటల్ సంబంధిత అంశాల్లో నైపుణ్యం సాధించేలా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్‌ను ప్రారంభించారు. 18 నెలల కాలంలో 10 లక్షల మందికి దేశంలో వచ్చే 18 నెలల కాలంలో 10 లక్షల మందిని డిజిటల్ టెక్నాలజీలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డైటీ) ఏర్పాటు చేసిన సీఎస్‌సీ-ఎస్‌పీవీ కం పెనీతో ద నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) ఫౌండేషన్ చేతులు కలిపింది. ఈ మేరకు నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్(ఎన్‌డీఎల్‌ఎం) తొలి దశ లక్ష్యాన్ని సాధించే దిశగా ఇరు సంస్థలూ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. పీపీపీ పద్ధతిలో పబ్లిక్-ప్రైవేట్-పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో ఈ విభిన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలో సీఎస్‌సీ-ఎస్‌పీవీ పాఠ్యాంశాలను రూపొందిస్తుంది. నాస్కామ్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. దీని కోసం సైయంట్, కాగ్నిజెంట్, గూగుల్, ఇంటెల్ తదితర సంస్థలతో ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు కేంద్రాలు నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్‌లో భాగంగా.. నాస్కామ్.. జెన్సర్ టెక్నాలజీస్, డిజిటల్ ఎంపవర్‌మెంట్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ ఏడాది హైదరాబాద్, పుణెలలో కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో ఈ ఏడాది జూలైలో, పుణెలో ఈ నెల ఆరో తేదీన ప్రారంభించిన కేంద్రాల్లో దాదాపు 3 వేల మందికి శిక్షణనిస్తారు. ఇందులో ప్రతి కుటుంబంలో ఒక్కరైనా డిజిటల్ విభాగాల్లో నైపుణ్యం సాధించేలా డిజిటల్ లిటరసీ, జాబ్ ఓరియెంటెడ్ ఇంగ్లిష్ ప్రోగ్రామ్, డీటీపీ, యానిమేషన్ సాఫ్ట్‌వేర్ డిజైన్, బిజినెస్- ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగామ్స్, వివిధ సామాజిక సమస్యలకు సంబంధించి అవగాహన, చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇవి లెక్చర్ సెషన్, గ్రూప్ ప్రాజెక్ట్, మోటివేషన్ సెషన్స్‌గా ఉంటాయి డిజిటల్ లిటరసీ వీక్ నేషనల్ డిజిటల్ లిటరసీలో భాగంగా నాస్కామ్ తన భాగస్వామ్య కంపెనీలతో కలిసి సంయుక్తంగా డిసెంబర్ 8 నుంచి 12 వరకు డిజిటల్ లిటరసీ వీక్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా వాలంటీర్ల రూపంలో ఐటీ ఉద్యోగుల సేవలను వినియోగించుకుని ఈ అంశంపై అవగాహన కల్పించనుంది. 2012లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 25వేల మందికి కంప్యూటర్ బేసిక్ స్కిల్స్‌ను నేర్పించారు. నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ వెబ్‌సైట్: www.ndlm.in Criminology-Vidya- దేశంలో జనాభా పోటెత్తుతోంది. నేరాలు కూడా అదేస్థాయిలో పెరిగిపోతున్నాయి. మరోవైపు తీవ్రవాదం పంజా విసురుతోంది. ఉగ్రవాదం ఉరుముతోంది. వీట న్నింటితో ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతోంది. అంతిమం గా దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో నేర నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవస రం ఏర్పడింది. అందుకే క్రిమినాలజిస్ట్‌లకు డిమాండ్ పెరిగింది. దీన్ని కెరీర్‌గా మార్చుకుంటే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఆకర్షణీయమైన ఆదాయం మెండుగా ఉంటాయి. సవాళ్లతో కూడిన ఉత్సాహభరితమైన కెరీర్‌ను ఇష్టపడేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది. బ్యాంకులు, కార్పొరేట్ సంస్థల్లో కొలువులు క్రిమినాలజిస్ట్‌లు సమాజంలో నేరాలకు గల కారణాలు, నేరస్తుల స్వభావం, నేరాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పోలీసు, న్యాయ వ్యవస్థ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ, సెమినార్ల ద్వారా అవగాహన కల్పించాలి. క్రిమినాలజీ కోర్సులను పూర్తిచేసినవారు యూనివర్సిటీ/కాలేజీల్లో లీగల్ స్టడీస్, లా అండ్ సోషియాలజీ, క్రిమినాలజీ ఫ్యాకల్టీగా పనిచేయొచ్చు. నేడు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల కంపెనీలు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్లు నిపుణులైన క్రిమినాలజిస్ట్‌ల కొరత ను ఎదుర్కొంటున్నాయి. పర్యావరణ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘన వంటి వాటిపై విచారణ జరిపే సంస్థల్లో వీరికి అధిక డిమాండ్ ఉంది. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, పరిశోధనా సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. క్రిమినాలజీలో కార్పొరేట్ క్రైమ్, ఎన్విరాన్‌మెంటల్ క్రైమ్ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఆర్థిక నేరాలను అరికట్టేందుకు బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు కూడా క్రిమినాలజిస్ట్‌లను నియమించుకుంటున్నాయి. కార్పొరేట్ రంగంలో చేరితే అధిక వేతనాలు అందుకోవచ్చు. కావాల్సిన నైపుణ్యాలు:క్రిమినాలజిస్ట్‌కు విశ్లేషణాత్మక దృక్పథం అవసరం. ప్రతి విషయాన్ని తర్కబద్ధంగా ఆలోచించగలగాలి. డేటా కలెక్షన్, అనాలిసిస్‌పై మంచి పరిజ్ఞానం ఉండాలి. సైకాలజీ, సోషియాలజీపై అవగాహన పెంచుకోవాలి. కష్టపడి పనిచేసే గుణం ఉండాలి. ఒత్తిళ్లు, సవాళ్లను తట్టుకొని పనిచేసే నేర్పు చాలా ముఖ్యం. అర్హతలు: మన దేశంలో వివిధ విద్యాసంస్థలు క్రిమినాలజీలో అండర్‌గ్రాడ్యుయేట్(బీఏ/బీఎస్సీ), పోస్టుగ్రాడ్యుయేట్(ఎంఏ/ఎంఎస్సీ) కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైనవారు అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులో చేరొచ్చు. ఇందులో ఉత్తీర్ణత సాధించి, పోస్టుగ్రాడ్యుయేషన్‌లో చేరేందుకు అవకాశం ఉంటుంది. వేతనాలు: క్రిమినాలజిస్ట్‌లు తమ హోదాలను బట్టి వేతనాలు అందుకోవచ్చు. ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు పొందొచ్చు. ఆ తర్వాత పనితీరు, అనుభవం, పదోన్నతుల ద్వారా వేతనంలో పెరుగుదల ఉంటుంది కోర్సులను అందిస్తున్న సంస్థలు:  లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్(ఎన్‌ఐసీఎఫ్‌ఎస్)-న్యూఢిల్లీ వెబ్‌సైట్: nicfs.nic.in/  ఆంధ్రా యూనివర్సిటీ వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in  బెనారస్ హిందూ యూనివర్సిటీ వెబ్‌సైట్:  www.bhu.ac.in  లక్నో యూనివర్సిటీ వెబ్‌సైట్:  www.lkouniv.ac.in  యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వెబ్‌సైట్:  www.unom.ac.in Science Olympiods-Vidya దేశంలోని ప్రీ యూనివర్సిటీ స్థాయిలో బేసిక్ సైన్సెస్ పట్ల ఆసక్తి పెంచడంతోపాటు.. ఆయా సబ్జెక్టుల్లో ప్రావీణ్యతను పరీక్షించేందుకు ఉద్దేశించినవి నేషనల్ ఒలంపియాడ్స్. ఇందులో అర్హత సాధించిన వారికి అంతర్జాతీయంగా నిర్వహించే ఒలంపియాడ్స్‌లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఐఏపీటీ), హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్(హెచ్‌బీసీఎస్‌ఈ) ఆధ్వర్యంలో నేషనల్ ఒలంపియాడ్‌ను నిర్వహిస్తారు మొత్తం ఐదు విభాగాల్లో.. ఐదు దశలుగా ఒలంపియాడ్స్ ఉంటాయి. అవి.. నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్, ఇండియన్ నేషనల్ ఒలంపియాడ్ ఎగ్జామినేషన్స్, ఓరియంటేషన్ కం సెలక్షన్ క్యాంప్, ట్రైనింగ్ ఇండియన్ టీమ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఒలంపియాడ్స్, ఇంటర్నేషనల్ ఒలంపియాడ్స్. వీటిల్లో నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్‌ను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఐఏపీటీ) నిర్వహిస్తుంది. మిగతావిభాగాలను హెచ్‌బీసీఎస్‌ఈ పర్యవేక్షిస్తుంది. మొత్తం నాలుగు సబ్జెక్టుల్లో నేషనల్ ఒలంపియాడ్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. అవి.. ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ. పాఠశాల స్థాయిలోని ప్రతిభావంతులను కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో 2008-09 నుంచి జూనియర్ సైన్స్ విభాగాన్ని ప్రవేశపెట్టారు నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్: నేషనల్ ఒలింపియాడ్స్‌కు ఇది మొదటి దశ. ఒలంపియాడ్ ప్రోగ్రామ్స్‌పై అవగాహన కల్పించడంతోపాటు ఇందులో పాల్గొనే విద్యార్థుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ఈ దశను నిర్వహిస్తారు. ఐదు విభాగాల్లో ఉండే ఈ పరీక్షను ఆయా సబ్జెక్టులాధారంగా.. నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ ఫిజిక్స్(ఎన్‌ఎస్‌ఈపీ)/ఆస్ట్రానమీ(ఎన్‌ఎస్‌ఈఏ)/బయాలజీ(ఎన్‌ఎస్‌ఈబీ)/కెమిస్ట్ రీ(ఎన్‌ఎస్‌ఈసీ)/జూనియర్ సైన్స్(ఎన్‌ఎస్‌ఈజేఎస్)గా వ్యవహరిస్తారు. అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ: 12వ తరగతి/దిగువ తరగతులు చదువుతుండాలి. జూనియర్ సైన్స్: పదో తరగతి/దిగువ తరగతి చదువుతూండాలి సిలబస్: సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగా నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్స్(ఎన్‌ఎస్‌ఈఎస్) ను నిర్వహిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లలో సీబీఎస్‌ఈ 11, 12వ తరగతుల సిలబస్ ఆధారంగా ఆయా సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆస్ట్రానమీ కూడా సీబీఎస్‌ఈ 11, 12వ తరగతులాధారంగా సిలబస్ ఉంటుంది. కానీ ఇందులో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎలిమెంటరీ ఆస్ట్రానమీ సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. జూనియర్ సైన్స్ విభాగంలో.. సీబీఎస్‌ఈ పదో తరగతి స్థాయి సిలబస్ ఉంటుంది. ఇందులో సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ), మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి ఎగ్జామ్ ప్యాట్రన్: జ్ఞాపక శక్తికి కాకుండా.. విద్యార్థి స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా విధానం సబ్జెక్టును బట్టి వేర్వేరుగా ఉంటుంది. వివరాలు.. ఫిజిక్స్ పేపర్ మొత్తం 180 మార్కులకు ఉంటుంది. ఇందులో పార్ట్-ఎ,బి రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఎలో మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో 50 ప్రశ్నలు అడుగుతారు. తిరిగి పార్ట్-ఎ.. ఎ1, ఎ2 అనే రెండు సెక్షన్లుగా ఉంటుంది. ఎ1లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఎ2లో ఉండే 10 ప్రశ్నలకు ఇచ్చే ఆప్షన్స్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి. ఇందులో సరైన సమాధానాలన్నిటిని గుర్తించాలి. పార్ట్-బిలో 5-6 షార్ట్ ఆన్సర్ టైప్ కొశ్చన్స్/ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్ భాషలో ఉంటుంది (300/ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకుంటే హిందీ/స్థానిక భాషల్లోను నిర్వహిస్తారు.) కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్ విభాగంలో పరీక్షలను మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఇంగ్లిష్ భాషలో నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌లో 80 ప్రశ్నల చొప్పున ఉంటాయి. సమాధానాలను గుర్తించడానికి కేటాయించిన సమయం రెండు గంటలు. వివరాలకు: www.iapt.org.in రెండో దశ.. ఐఎన్‌ఓఎస్: మొదటి దశ.. ఎన్‌ఎస్‌ఈఎస్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశ.. ఇండియన్ నేషనల్ ఒలంపియాడ్ ఎగ్జామినేషన్స్ (ఐఎన్ ఓఎస్)కు ఎంపిక చేస్తారు. ఎన్‌ఎస్‌ఈఎస్‌లో ప్రతిభ చూపిన విద్యార్థుల్లో ప్రతి సబ్జెక్ట్ నుంచి 300 మంది చొప్పున విద్యార్థులను రెండో దశకు ఎంపిక చేస్తారు. ఐదు విభాగాల్లో ఉండే ఈ పరీక్షను ఆయా సబ్జెక్టులాధారంగా.. ఇండియన్ నేషనల్ ఫిజిక్స్ ఒలంపియాడ్ ఎగ్జామినేషన్/ఇండియన్ నేషనల్ కెమిస్ట్రీ ఒలంపియాడ్ ఎగ్జామినేషన్/ఇండియన్ నేషనల్ బయాలజీ ఒలంపియాడ్ ఎగ్జామినేషన్/ఇండియన్ నేషనల్ ఆస్ట్రానమీ ఒలంపియాడ్ ఎగ్జామినేషన్/ఇండియన్ నేషనల్ జూనియర్ సైన్స్ ఒలంపియాడ్ ఎగ్జామినేషన్‌గా వ్యవహరిస్తారు. మొదటి దశలో అనుసరించిన సిలబస్‌నే ఈదశలోను వినియోగిస్తారు. ప్రశ్నలు నాన్-కన్వెన్‌షన్ పద్ధతిలో ఉంటాయి. ప్రశ్నల క్లిష్టత అంతర్జాతీయ ఒలంపియాడ్ స్థాయిలో ఉంటుంది. బయాలజీ మినహా మిగతా విభాగాల్లో సమాధానాలను గుర్తించడానికి కేటాయించిన సమయం మూడు గంటలు. బయాలజీకి మాత్రం రెండు గంట ల్లోనే జవాబులను గుర్తించాలి. మూడో దశ.. ఓసీఎస్‌సీ: దీన్ని కీలక దశగా భావించవచ్చు. ఇందులో చూపిన ప్రతిభ ద్వారానే ఇంటర్నేషనల్ ఒలంపియాడ్స్‌లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించే విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ దశను ఓరియంటేషన్ కం సెలక్షన్ క్యాంప్ (ఓసీఎస్‌సీ)గా వ్యవహరిస్తారు. ఇందుకోసం ప్రతి సబ్జెక్టు నుంచి 35 మంది విద్యార్థులను ఓసీఎస్‌సీకి ఎంపిక చేస్తారు. జూనియర్ సైన్స్ విభాగం నుంచి మాత్రం 45 మందికి అవకాశం ఉంటుంది. ఓసీఎస్‌సీకి ఎంపికైన విద్యార్థులకు హెచ్‌బీసీఎస్‌ఈలో అత్యున్నత ప్రమాణాలతో రెండు నుంచి నాలుగు వారాల పాటు ఓరియెంటేషన్ క్యాంప్ ఉంటుంది. ఇందులో విద్యార్థులకు తమ సబ్జెక్టుల్లో సైద్ధాంతిక, ప్రయోగత్మక శిక్షణనిస్తారు. వివిధ ప్రయోగాలను సొంతంగా చేసే అవకాశం ఉంటుంది. సంబంధిత సబ్జెక్టుల్లో ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో ఓరియెంటేషన్ క్లాసులు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి తర్వాత దశకు అర్హత కల్పిస్తారు. ఈక్రమంలో ఫిజిక్స్, ఆస్ట్రానమీ నుంచి ఐదుగురు చొప్పున, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి నలుగురు చొప్పున, జూనియర్ సైన్స్ నుంచి 12 మంది విద్యార్థులకు తర్వాత దశకు ఎంపిక చేస్తారు. వీరికి పుస్తకాలు, క్యాష్ రూపంలో రూ.5 వేల మెరిట్ అవార్డులు ఇస్తారు. అంతేకాకుండా ఆయా సబ్జెక్టుల్లో భారత్ తరపున అంతర్జాతీయ ఒలంపియాడ్స్‌లో పాల్గొంటారు. వీరికేకాకుండా థియరీ, ఎక్స్‌పెరిమెంటల్ పరంగా ప్రతిభ చూపిన ఇతర విద్యార్థులకు బహుమతులను కూడా అందజే స్తారు. ట్రైనింగ్ ఇండియన్ టీమ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఒలంపియాడ్స్: అంతర్జాతీయ ఒలంపియాడ్స్‌కు సన్నద్ధం చేసేలా విద్యార్థుల శిక్షణ కోసం ఈ దశను ఉద్దేశించారు. ఇందులో హెచ్‌బీసీఎస్‌ఈ ఫ్యాకల్టీలు, శాస్త్రవేత్తలతోపాటు ఆయా సబ్జెక్టులకు సంబంధించి ప్రముఖ సంస్థల డెరైక్టర్లు, నిపుణుల కూడా పాల్గొంటారు. ప్రత్యేక ల్యాబొరేటరీలను కూడా ఏర్పాటు చేస్తారు. కెమిస్ట్రీ, బయాలజీకి రెండు వారాలపాటు, ఫిజిక్స్ రెండు వారాల కంటే ఎక్కువ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్ విభాగాలకు వారం రోజుల పాటు శిక్షణనిస్తారు ఇంటర్నేషనల్ ఒలంపియాడ్స్: అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు విద్యార్థుల ముందు తామ ప్రతిభాపాటవాలను నిరూపించుకోవడానికి భారతీయ విద్యార్థులకు ఇది చక్కని అవకాశం. విద్యార్థులతోపాటు ఒలంపియాడ్స్‌కు వెళ్లే టీమ్‌లో మార్గదర్శకం చేయడానికి ఉపాధ్యాయులు, సైంటిఫిక్ ఆబ్జర్వర్ ఉంటారు. ఫిజిక్స్, ఆస్ట్రానమీలలో ప్రతి జట్టు నుంచి ఐదుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు, సైంటిఫిక్ ఆబ్జర్వర్ ఉంటారు. బయాలజీ, కెమిస్ట్రీ ప్రతి జట్టు నుంచి నలుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు, సైంటిఫిక్ ఆబ్జర్వర్ ఉంటారు. జూనియర్ సైన్స్ విభాగంలో 12 మంది విద్యార్థులు(6 గురు చొప్పున రెండు జట్లు), ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటారు. Animal Trainer ఇంట్లో కుక్కలు, పిల్లులు వంటి జంతువులను పెంచుకోవడం చాలామందికి అభిరుచి, అలవాటు. ఇవి యజమానుల పట్ల విశ్వాసపాత్రంగా మెలుగుతాయి. వారికి రక్షణ కల్పిస్తాయి. ఇంట్లో పెంపుడు జంతువులు ఉండడం సమాజంలో ఒక హోదాగా మారింది. ఇక పోలీసు, రక్షణ శాఖలో జాగిలాలు అందిస్తున్న సేవలు తెలిసినవే. జంతువులను మచ్చిక చేసుకోవడం అనాదిగా ఉన్నదే. జంతువులను పెంచుకోవాలంటే మొదట వాటికి తగిన శిక్షణ ఇవ్వాలి. శిక్షణ పొందినవే.. యజమానులు చెప్పినట్లు నడుచుకుంటాయి. క్రమశిక్షణతో మెలుగుతాయి. ఇలాంటి వాటికే మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంటుంది. జంతువులకు శిక్షణ ఇచ్చే నిపుణులే.. యానిమల్ ట్రైనర్లు. ఆధునిక కాలంలో పెట్స్ సంస్కృతి విస్తరిస్తుండడంతో ట్రైనర్లకు అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా లభిస్తున్నాయి. విదేశాల్లో ఎప్పటినుంచో ఆదరణ పొందుతున్న ఈ కెరీర్.. భారత్‌లోనూ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. యానిమల్ ట్రైనింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటే ఉపాధికి ఢోకా ఉండదని ఘంటాపథంగా చెప్పొచ్చు. సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో.. జంతు శిక్షకులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. పోలీసు, రక్షణ శాఖలో, వెటర్నరీ క్లినిక్స్, పెట్ షాప్స్, జంతు ప్రదర్శనశాలలు, యానిమల్ షెల్టర్స్, వైల్డ్‌లైఫ్ పార్కులు, రిజర్వ్‌లు, పరిశోధనా కేంద్రాలు, సర్కస్‌ల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. విదేశాల్లో అయితే సినిమాలు, టీవీ కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనలు, ప్రింట్ యాడ్స్‌లోనూ యానిమల్ ట్రైనర్ల సహాయం తీసుకుంటున్నారు. ఆకర్షణీయమైన వేతనాలు అందజేస్తున్నారు. జంతువులతో సంబంధం ఉన్న ప్రతిరంగంలోనూ వీరికి అవకాశాలుంటాయి. సొంతంగా జంతువులకు శిక్షణ ఇచ్చి, వాటిని విక్రయించుకోవచ్చు. కావాల్సిన నైపుణ్యాలు: యానిమల్ ట్రైనర్లకు ప్రాథమికంగా జంతువుల పట్ల అభిమానం, వాటిని ప్రేమించే గుణం ఉండాలి. సమయానుసారంగా జంతువుల ప్రవర్తనను అర్థం చేసుకొని తదనుగుణంగా వ్యవహరించే నేర్పు అవసరం. సమస్యలను పరిష్కరించే నైపణ్యం కావాలి. శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. స్వయం నియంత్రణ అవసరం. కోపతాపాలకు, ఆవేశానికి దూరంగా ఉండాలి. వివిధ జంతువుల ప్రవర్తన వేర్వేరుగా ఉంటుంది కాబట్టి ఓపిక, సహనంతోపనిచేయగలగాలి. అర్హతలు: మనదేశంలో యానిమల్ ట్రైనర్‌గా మారేందుకు ఎలాంటి విద్యార్హతలు, నియమ నిబంధనలు లేవు. అయితే, కనీసం ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులై ఉండడం మంచిది. అమెరికా, యునెటైడ్ కింగ్‌డమ్(యూకే), ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో యానిమల్ సైన్స్, యానిమల్ బిహేవియర్, బయాలజీ, జువాలజీ, మెరైన్ బయాలజీ, సైకాలజీ కోర్సులను చదివినవారు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ కోర్సులను పలు యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. వేతనాలు: యానిమల్ ట్రైనర్‌కు ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం లభిస్తుంది. ఈ రంగంలో అనుభవం, పనితీరును బట్టి ఆదా యం ఉంటుంది. నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదించే ట్రైనర్లు కూడా ఉన్నారు. విదేశాల్లో ఇంకా అధిక వేతనాలు అందుతాయి. శిక్షణ, సేవలు అందిస్తున్న సంస్థలు:  కమాండో కెన్నెల్స్-హైదరాబాద్ వెబ్‌సైట్: www.commandokennels.com/  యూనివర్సిటీ ఆఫ్ లింకన్. వెబ్‌సైట్: www.lincoln.ac.uk  ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ వెబ్‌సైట్: www.anglia.ac.uk/ruskin/en/landing.html  యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్. వెబ్‌సైట్: www.chester.ac.uk  ద సెంటర్ ఆఫ్ అప్లయిడ్ పెట్ ఎథాలజీ వెబ్‌సైట్: www.coape.org అరుణ్‌ కుమార్‌ మరపట్ల-By Arun Kumar Marapatla

No comments: