Tuesday, March 9, 2010

అను క్షణికం

ఏకాంత నిశీధిలో
నీ తలపు తటిల్లత
నీ చూపుల్తో వేనవేల కాంతులీని
అనంత శూన్యానికి నెట్టి
హృద్విస్పోటనం చేశావు...

గ్రహశకలంలా చుట్టూ పరిభ్రమిస్తూ...
ఎడారి దారుల్లో ఏకాకిగా మిగిల్చావు
దిక్కులన్నీ పిక్కట్టిల్లేలా
వేయి ఆమనులొక్కసారిగా
పాడిన అనీశ రాగం...నీ
పిలుపు


ఆలాపనని చీల్చుకుని వచే నిశ్శబ్దం నీ రాక
వెలుగు చారికల ఒడిలో నను దించి
వెన్నెల వర్షాన్ని కురిపించి
చిగురుటూహలకి ఆశల్ని రేకెత్తించి
మొగలిపూల మత్తెక్కించి
నా వాకిట
వేకువ జాము ముగ్గులా నిలిచావు!

మాటలన్నీ రాగాలై అనురాగాన్ని వర్షించి
విషాదాన్ని అమృతంగా తాగించి
ఒంటరిని చేసి వెళ్ళిపొయావు.

అను నిబద్దుణ్ణి చేసి
జ్ఞాపకాల దారాన్ని చిక్కుచేసి
పాశాన్ని బంధించి
ఆశల్ని శైథిల్యం చేసి
మోడుగా మిగిల్చి
నా నీడల్ని ఆవాహనం చేసుకెళ్ళావు!

సినీవాలిగా మార్చి
నైర్యాశ్యపు నెగళ్ళలోంచి
నెగ్గుకు రమ్మన్నావు!

హృద్విపంచిని మీటినా
వినిపించని వీణానాదం
నీ తలపుల నా గానం!

వలపు ఉత్తరానికి
చిరునామాగా నిలిచి
నిను పొదివి పట్టుకోలేక
దారి తప్పిన లేఖని

నీ ఊహా వీధులో
గగన విహారిని

వర్షం నీళ్ళలో
జారుకుంటూ వెళ్తున్న
కాగితపూల పడవని
నిను చేరుకోలేని
నా పయనం
అవతలి తీరానికి
ఒంతరిగా పంపి
నీ విషాదాన్ని
మంచులా కప్పేశావు

నా పాదాలకు
కొత్త నడక నేర్పి
నీకూ నాకూ మధ్య
కొలవలేని దూరాల్ని పెంచి
నిర్దయగా వేరైపోయావు!


ఎన్ని యుగాలపాటు
నీకై నిరీక్షణ
జన్మకు అనర్హుణ్నే
నువ్వో అసూర్యంపశ్యవి
నే తాకలేని కెరటానివి

అను రాధా
అను రాధా
లబ్ డబ్
లబ్ డబ్ లా
నా గుండె సవ్వడి
వినిపిస్తోందా

అందుకేనేమో
ఏకాంత నిశీధిలో
నీ తలపు తటిల్లత....

ఎద లోతుల్ని తడుముతున్న నీకు


అరుణ్‌ కుమార్‌ మరపట్ల
Arun Kumar Marapatla




No comments: