Thursday, August 31, 2023

ఫిట్‌నెస్‌ ట్రైనర్లు- యాంకర్‌ పార్ట్‌ -అరుణ్‌ కుమార్‌ మరపట్ల By Arun Kumar Marapatla -Viday Programme

Vidya-Anchor part-23.01.2015 This Programme is telecasted in 6TV in Vidya Programme. Programme Producer Arun Kumar Marapatla -అరుణ్‌ కుమార్‌ మరపట్ల యాంకర్: ఫిటినెస్ ట్రైనర్ సూచనలను పాటిస్తూ చెమటలు చిందిస్తున్నారు. ఇప్పటి యువతను అమితంగా ఆకర్షిస్తున్న అంశం... సిక్స్‌ప్యాక్ బాడీ. సినీ నటుల తరహాలో ఆరు ఫలకల దేహం కోసం జిమ్‌లలో చేరి, గంటల తరబడి కష్టపడుతున్నారు. ప్రజాదరణ లభిస్తుండడంతో ప్రతి గల్లీలో జిమ్‌లు వెలుస్తున్నాయి. అనేది ఉద్యోగానికి, ఉపాధికి వంద శాతం భరోసా కల్పిస్తున్న ఫిట్‌నెస్ ట్రైనింగ్ కెరీర్‌ విశేషాల్ని గురించి ఈవాళ్టి విద్యలో తెలుసుకుందాం. యాంకర్: సాంకేతిక శాస్త్రంలో సరికొత్త ఆవిష్కరణలు వంటి కారణాలతో ఎన్నో జీవ జాతులు ప్రమాదపుటంచుల్లో నిలుచున్నాయి. మరెన్నో అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు జీవ వైవిధ్య ప్రాధాన్యాన్ని గుర్తించాయి. జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రపంచ దేశాలు ఇప్పుడు నడుం బిగించాయి. ఇప్పుడు జీవ వైవిధ్య నిపుణులకోసం అపార ఉపాధి అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. అకడెమిక్ స్థాయిలో జీవ వైవిధ్య పరిరక్షణకు ఊతమిచ్చే కోర్సులకు రూపకల్పన జరుగుతోంది. మరి ఆ కోర్సు వివరాల్ని ఈవాళ్టి విద్యలో చూద్దాం. యాంకర్: మనిషి కంటికి కనిపించని అతి సూక్ష్మ జీవుల అధ్యయనమే.. సూక్ష్మ జీవశాస్త్రం.ఈ కోర్సును అధ్యయనం చేసిన వారిని మైక్రో బయాల జిస్ట్‌లుగా వ్యవహరిస్తారు. మంచి వేతనంతోపాటు పరిశోధనల ద్వారా సమాజానికి సేవ చేసేందుకు అవకాశం కల్పించే మైక్రో బయాలజిస్ట్ కెరీర్ విశేషాల్ని గురించి ఈవాళ్టి విద్యలో తెలుసుకుందాం. యాంకర్: భారత్‌లో తోలు పరిశ్రమ వేగంగా అభి వృద్ధి చెందుతోంది. తోలు ఎగుమతుల ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరు తోంది. మనదేశంలో ప్రతిఏటా 2 బిలియన్ చదరపు అడుగుల ముడి తోలు ఉత్పత్తవు తోంది. ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకా శాలు పుష్కలంగా లభిస్తున్నాయి. లెదర్ టెక్నా లజీని కెరీర్‌గా ఎంచుకుంటే లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి ఈ వాళ్టి విద్యలో తెలుసుకుందాం.

ఫిట్‌నెస్‌ ట్రైనర్లు- అరుణ్‌ కుమార్‌ మరపట్ల By Arun Kumar Marapatla Vidya Programme

Fitness-Vidya-23.01.2015 This Programme is telecasted in 6Tv in Vidya Programme. Programme producer Arun Kumar Marapatla అరుణ్‌ కుమార్‌ మరపట్ల నేటి ఆధునిక కాలంలో ఆరోగ్య పరిరక్షణ, దేహ దారుఢ్యంపై ప్రజల్లో ఎంతగానో అవగాహన పెరిగింది. అందుకే జిమ్‌లు, ఫిటినెస్ సెంటర్ల బాటపడుతున్నారు. ఊబకాయాన్ని తగ్గించు కొనేందుకు ఫిటినెస్ ట్రైనర్ సూచనలను పాటిస్తూ చెమటలు చిందిస్తున్నారు. ఇప్పటి యువతను అమితంగా ఆకర్షిస్తున్న అంశం... సిక్స్‌ప్యాక్ బాడీ. సినీ నటుల తరహాలో ఆరు ఫలకల దేహం కోసం జిమ్‌లలో చేరి, గంటల తరబడి కష్టపడుతున్నారు. ప్రజాదరణ లభిస్తుండడంతో ప్రతి గల్లీలో జిమ్‌లు వెలుస్తున్నాయి. వీటిలో శిక్షణ ఇచ్చే ట్రైనర్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్ ట్రైనింగ్ అనేది ఉద్యోగానికి, ఉపాధికి వంద శాతం భరోసా కల్పిస్తున్న కెరీర్‌గా గుర్తింపు పొందింది. ఇందులో అవకాశాలకు, ఆదాయానికి లోటు లేకపోవడంతో ఎంతోమంది ఈ రంగంపై దృష్టి సారిస్తున్నారు. సెలబ్రిటీ ట్రైనర్లకు అధిక ఆదాయం వ్యాయామ శిక్షకులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు సులువుగా లభిస్తున్నాయి. జిమ్‌లు, ఫిటినెస్ సెంటర్లలో వీరి భాగస్వామ్యం తప్పనిసరి. ప్రారంభంలో ఏదైనా జిమ్‌లో పనిచేసి, తగిన అనుభవం సంపాదించుకున్న తర్వాత సొంతంగా జిమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. మరోవైపు కార్పొరేట్ ఫిట్‌నెస్ సెంటర్లు రంగ ప్రవేశం చేస్తున్నాయి. వీటిలో ట్రైనర్లకు ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. సినీ నటులు, ప్రముఖులు నెలకు రూ.లక్ష వరకు వేతనం చెల్లిస్తూ సొంత ట్రైనర్లను నియమించుకుంటు న్నారు. ఫిట్‌నెస్‌పై టీవీ ఛానళ్లలో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ప్రేక్షకుల సందేహాలకు ట్రైనర్లతో సలహాలు, సూచనలు ఇప్పిస్తున్నారు. పత్రికలు, మ్యాగజైన్లలోనూ ట్రైనర్ల ఆధ్వర్యంలో ఫిట్‌నెస్ శీర్షికలు ప్రచురితమవుతున్నా యి. వీటన్నింటి వల్ల వ్యాయామ శిక్షకులకు ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. నైపుణ్యం కలిగిన శిక్షకులకు డిమాండ్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా రాణించాలంటే ముందు తన ఆరోగ్యాన్ని తప్పనిసరిగా కాపాడుకోవాలి. బాడీ ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నైపుణ్యం కలిగిన ఇన్‌స్ట్రక్టర్లకు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. కాబట్టి ఆసక్తి కలిగిన యువత ఈ రంగంలోకి నిస్సందేహంగా అడుగుపెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అర్హతలు: హెల్త్ అండ్ ఫిటినెస్ ట్రైనింగ్‌పై మనదేశంలో సర్టిఫికేషన్ కోర్సులు, డిప్లొమా ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో వీటిలో చేరొచ్చు. ఫిటినెస్ శిక్షకులకు ప్రత్యేకంగా ఎలాంటి విద్యార్హతలు అవసరం లేకపోయినా ఇలాంటి కోర్సులు చేసినవారికి మంచి అవకాశాలు దక్కుతాయి. వేతనాలు: జిమ్‌లో ఫిటినెస్ ట్రైనర్‌కు ప్రారంభంలో నెలకు రూ.10 వేల వేతనం అందుతుంది. తర్వాత అనుభవాన్ని బట్టి నెలకు రూ.30 వేలకు పైగానే పొందొచ్చు. మోడళ్లు, సినిమా నటులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలకు, వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగత ట్రైనర్‌గా పనిచేస్తే రూ.లక్షల్లో ఆదాయం ఉంటుంది. ఫిటినెస్ ట్రైనింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:  సింబయోసిస్ సెంటర్ ఫర్ హెల్త్‌కేర్-పుణె, వెబ్‌సైట్: www.schcpune.org  ఇండియన్ అకాడమీ ఆఫ్ ఫిటినెస్ ట్రైనింగ్, వెబ్‌సైట్: www.iaftworld.com  యూనివర్సిటీ ఆఫ్ అలబామా, వెబ్‌సైట్: www.ua.edu Bio Diversity-Vidya-23.01.2015 జీవ వైవిధ్యం.. ఇప్పుడు ప్రతినోటా వినిపిస్తున్న మాట. పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం.. మారుతున్న మానవ జీవన శైలి.. సాంకేతిక శాస్త్రంలో సరికొత్త ఆవిష్కరణలు వంటి కారణాలతో.. ఎన్నో జీవ జాతులు ప్రమాదపుటంచుల్లో నిలుచున్నాయి. మరెన్నో అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు జీవ వైవిధ్య ప్రాధాన్యాన్ని గుర్తించాయి. జీవ వైవిధ్య రక్షణకు..ఈ మేరకు తగిన తర్ఫీదునిచ్చేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో అకడెమిక్ స్థాయిలోనే.. జీవ వైవిధ్య పరిరక్షణకు ఊతమిచ్చే కోర్సులకు రూపకల్పన చేస్తున్నాయి. వివరాలు.. వృక్ష సంపద సంరక్షణకు..ఫారెస్ట్రీ: విభిన్న జీవ జాతుల మనుగడకు, వాతావరణ అనుకూలతలకు అత్యంత ఆవశ్యకం అడవులు. ప్రస్తుత హైటెక్ యుగంలో అడవులు నశిస్తున్నాయి. పర్యవసానంగా అనేక జీవ జాతులు తమ మనుగడ కోల్పోతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం సూచిస్తున్నాయి ఫారెస్ట్రీ కోర్సులు. అడవుల సంరక్షణ, వాటి ద్వారా లభించే సహజ వనరుల వినియోగం తదితరాలపై అవగాహన కల్పించే కోర్సు ఫారెస్ట్రీ. కోర్సులు: పలు యూనివర్సిటీలు డిగ్రీ, పీజీ స్థాయిలో ఫారెస్ట్రీ, సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. యూజీసీ- నెట్‌లో ఫారెస్ట్రీ స్పెషలైజేషన్ పరీక్ష జరుగుతోంది. అవకాశాలు: ఈ కోర్సు పూర్తి చేసిన వారికి అటవీ శాఖ, వ్యవసాయ పరిశోధన విభాగం; సోషల్ ఫారెస్ట్రీ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. బీఎస్సీ (ఫారెస్ట్రీ) అర్హతతో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షకు హాజరవ్వచ్చు. రాష్ర్ట స్థాయిలో ఏపీపీఎస్సీ నిర్వహించే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. కోర్సులు అందిస్తున్న యూనివర్సిటీలు: దాదాపు అన్ని వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు బ్యాచిలర్ స్థాయిలో బీఎస్సీ (ఫారెస్ట్రీ) కోర్సును అందిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ (బైపీసీ) ఉత్తీర్ణులు అర్హులు. అదే విధంగా సిల్వికల్చర్, ఫారెస్ట్ ప్రొడక్ట్స్, ఎకనామిక్స్ అండ్ మేనేజ్‌మెంట్, వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రీ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, ఆగ్రో ఫారెస్ట్రీ, వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లతో పలు యూనివర్సిటీలు ఎమ్మెస్సీ కోర్సును అందిస్తున్నాయి. భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్.. ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ కోర్సును, డెహ్రాడూన్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కోర్సులను అందిస్తున్నాయి. వేతనాలు: ప్లాంట్ బయోటెక్ సంస్థలు, ఎన్‌జీఓలు, సోషల్ ఫారెస్ట్రీ విభాగాల్లో చేరిన వారికి ప్రారంభంలో నెలకు రూ. 10 వేల నుంచి 12 వేల వరకు వేతనం లభిస్తుంది. బీఎస్సీ ఫారెస్ట్రీ, సంబంధిత కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు: ఉస్మానియా యూనివర్సిటీ తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కోర్సు:వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీఅర్హత: బీఎస్సీ(ఎంపీసీ). కోర్సు: ఎకనామిక్స్ అండ్ మేనేజ్‌మెంట్ అర్హత: బీఎస్సీ (బోటనీ/జువాలజీ/ కెమిస్ట్రీ/మ్యాథ్స్/అగ్రికల్చర్). కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ పల్ప్ అండ్ పేపర్ టెక్నాలజీ అర్హత: కెమిస్ట్రీ/అప్లైడ్ కెమిస్ట్రీలో పీజీ. మెరైన్ కన్జర్వేషన్ : జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రాముఖ్యం పెరుగుతున్న నేపథ్యంలో రూపుదిద్దుకున్న మరో కొత్త కోర్సు మెరైన్ కన్జర్వేషన్. సముద్రాలు, నదుల్లోని జల జీవ జాతులను సంరక్షించే మార్గాలను అధ్యయనం చేయడమే ఈ కోర్సు ప్రధానోద్దేశం. జలాంతర్భాగంలో నివసించే జీవుల మనుగడకు ఎదురవుతున్న సమస్యలు-పరిష్కార మార్గాలు; అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలు వంటివి అధ్యయనాంశాలుగా ఉంటాయి. పర్యావరణం, మెరైన్ చట్టాలు, జల-ఆర్థిక విధానాలు వంటి అంశాలపైనా శిక్షణ లభిస్తుంది. కోర్సులు: ప్రస్తుతం మెరైన్ బయాలజీ/ఎకాలజీ పేరుతో పలు కోర్సులు పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. అందిస్తున్న యూనివర్సిటీలు: గోవా యూనివర్సిటీ (గోవా) కోర్సు: ఎమ్మెస్సీ మెరైన్ సైన్స్ (మెరైన్ బయాలజీ, మెరైన్ జియాలజీ, మెరైన్ కెమిస్ట్రీ, మెరైన్ ఓషనోగ్రఫీ) యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కత (కోల్‌కత) కోర్సు: ఎమ్మెస్సీ (మెరైన్ సైన్స్) పాండిచ్చేరి యూనివర్సిటీ కోర్సు: ఎమ్మెస్సీ (మెరైన్ బయాలజీ) ఆంధ్రా యూనివర్సిటీ కోర్సు: ఎమ్మెస్సీ (మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్, మెరైన్ బయో టెక్నాలజీ) అవకాశాలు: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, కేంద్ర శాస్త్ర, సాంకేతిక పర్యావరణ శాఖ, ఓఎన్‌జీసీ చమురు అన్వేషణ సంస్థలు, సీ-ఫుడ్ ఎక్స్ పోర్ట్సంస్థలు, షిప్పింగ్ సంస్థలు, ఎన్‌జీఓల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నెలకు కనీసం రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వేతనం ఖాయం. ఎన్విరాన్‌మెంట్ సైన్స్: జీవ వైవిధ్యం ముప్పునకు ప్రధాన కారణం పర్యావరణ కాలుష్యం. పారిశ్రామిక, మానవ ప్రేరిత కాలుష్యాలే కారకాలుగా పలు జాతులు అంతరిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా రూపొందిన కోర్సే ఎన్విరాన్‌మెంట్ సైన్స్. భౌతిక, రసాయన, జీవశాస్త్ర అంశాలను శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేసే కోర్సు ఎన్విరాన్‌మెంట్ సైన్స్. వాతావరణ మార్పులు, శక్తి సంరక్షణ, జీవ వైవిధ్యం, భూగర్భ జల వనరులు, జల-వాయు-శబ్ద కాలుష్యాలు, ఇతర కాలుష్యాలు (పర్యావరణం, పా్లిస్టిక్ వ్యర్థాలు తదితర) వంటి అంశాలపై లోతైన అధ్యయనం చేస్తారు. ‘క్లీన్ ఎన్విరాన్‌మెంట్’ అనే భావన పెరుగుతున్న నేపథ్యంలో కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగావకాశాలు ఖాయం. కోర్సులు: పీజీ (ఎమ్మెస్సీ/ఎంఈ) స్థాయిలోనే అందుబాటులో ఉన్నాయి. అర్హత బీఎస్సీ. అధిక శాతం వర్సిటీలు ఎమ్మెస్సీ ఎన్విరాన్‌మెంట్ సైన్స్ను.. ఎంఈలో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్స్‌ను అందిస్తున్నాయి. అవకాశాలు: గనులు, ఎరువులు, ఆహార తయారీ పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థల్లో ఉద్యోగాలు గ్యారెంటీ. వేతనాలు: ఎంచుకున్న సెక్టార్ ఆధారంగా నెలకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనాలు లభిస్తాయి. ఎమ్మెస్సీ ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (బెంగళూరు) వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డెహ్రాడూన్) బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (ముంబై) ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (న్యూఢిల్లీ) స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (న్యూఢిల్లీ), పీహెచ్‌డీ ఇన్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్‌ను అందిస్తోంది. ఆంత్రోపాలజీ: జీవ వైవిధ్య మనుగడకు ముప్పు దిశగా కేవలం జంతువులే కాకుండా అనేక మానవ జాతుల కూడా అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా దట్టమైన అడవుల్లో నివసించే ఆదిమ జాతుల ఉనికి ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో మానవ జాతులు, వాటి మూలాలు, ప్రస్తుత సమస్యలు, పరిష్కార మార్గాలు వంటి అంశాలపై అధ్యయనం చేసే శాస్త్రమే ఆంత్రోపాలజీ. దీంతోపాటు ఆయా జాతుల తమ పరిసరాల పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యలు, వాటి ఫలితాలు వంటివాటిపై శిక్షణ లభిస్తుంది. దాదాపు అన్ని యూనివర్సిటీలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. మన రాష్ర్టంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల్లో ఈ కోర్సు ఉంది. కోర్సు పూర్తి చేసిన వారికి బోధన, పరిశోధన, మ్యూజియంలలో అవకాశాలు లభిస్తాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ప్లానింగ్ కమిషన్ వంటి జాతీయ స్థాయి సంస్థలతోపాటు యూఎన్‌ఓ అనుబంధ యునెస్కో,యూనిసెఫ్ వంటి విభాగాల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ అన్ని జీవరాశులకు సంబంధించి అధ్యయనంచేసే కోర్సు వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ కోర్సు. ఆయా జీవాలకు ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలను చూపే అంశాలతో కోర్సు కరిక్యులం రూపుదిద్దుకుంది. ఇటీవల కాలంలో వాణిజ్య పరంగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా పెంపుడు జంతువులపై సమాజంలో ఆసక్తి పెరగడం, ఆ మేరకు నిపుణుల అవసరం ఏర్పడంతో కోర్సు ఉత్తీర్ణుల భవిష్యత్తుకు ఢోకా లేదు. రాష్ర్టంలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో బ్యాచిలర్, మాస్టర్ స్థాయిలో వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్ (బైపీసీ) ఉత్తీర్ణులు బ్యాచిలర్ కోర్సుకు, బీవీఎస్సీ అండ్ ఏహెచ్ ఉత్తీర్ణులు మాస్టర్స్ కోర్సుకు అర్హులు. వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. జాతీయ ప్రవేశ పరీక్ష ద్వారా దేశంలోని మొత్తం బీవీఎస్సీ అండ్ ఏహెచ్ సీట్లలో 15 శాతం సీట్లను భర్తీ చేస్తుంది. ఇంటర్మీడియెట్ (బైపీసీ) ఉత్తీర్ణులు ఈ పరీక్షకు అర్హులు. బ్యాచిలర్ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (గుజరాత్) బిర్సా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (జార్ఖండ్) సెంట్రల్ అగ్రికల్చర్ యూనవర్సిటీ (ఇంఫాల్) పాండిచ్చేరి యూనివర్సిటీ (పుదుచ్చేరి) అవకాశాలు: బ్యాచిలర్ కోర్సు పూర్తి చేసుకుంటే వెటర్నరీ హాస్పిటల్స్, పశు సంవర్ధక కేంద్రాలు, ఇన్సూరెన్స్ సంస్థలు, బ్యాంకులు, డైరీ ఫార్మ్ వంటి విభాగాలు, జీవ ఔషధ తయారీ సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సొంతంగా ప్రాక్టీస్ క్లినిక్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. ‘వైవిధ్యం’గా ఉంటేనే ఇతర రంగాలతో పోల్చితే జీవ వైవిధ్య సంబంధ కోర్సుల్లో చేరే వ్యక్తులకు ప్రత్యేక లక్షణాలు ఉండాలి. నిజమైన ఆసక్తి, చేరాలనుకున్న కోర్సు, సంబంధిత రంగంలో రాణించేందుకు సహనం అవసరం. ఉదాహరణకు వెటర్నరీ సైన్స్ అంటే ఇప్పటికీ పలువురు విద్యార్థుల్లో కొంత చిన్నచూపు ఉంది. అదే విధంగా ఆంత్రోపాలజీని పరిగణనలోకి తీసుకుంటే..అది క్షేత్రస్థాయి పర్యటనలు ఆవశ్యకమైన విభాగం. ఇలా.. జీవ వైవిధ్య విభాగాల్లో ఒక్కో విభాగానికి విధుల పరంగా వైవిధ్యభరితమైన అవసరాలు ఉంటాయి. ఇతర రంగాలతో పోల్చుకుంటే పని గంటల విషయంలో కూడా వ్యత్యాసాలు ఉంటాయి. ఔత్సాహిక అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే అవసరమైన లక్షణాలను అలవర్చుకుంటే.. పీజీలోనే అధిక శాతం అందుబాటులో ఉన్న ఈ కోర్సుల్లో రాణించడానికి మార్గం సుగమం అవుతుంది. ప్రవేశాలు ఇలా.. దాదాపు ఈ కోర్సులన్నీ మాస్టర్ డిగ్రీ స్థాయిలోనే ఉండటంతో ఆయా యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షల ద్వారా, ప్రభుత్వ యూనివర్సిటీలు,సెంట్రల్ వర్సిటీలు సంబంధిత సబ్జెక్ట్‌లో గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు జనవరి నుంచి ప్రక్రియ మొదలవుతుంది. వీటికోసం ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల వెబ్‌సైట్స్ చూడొచ్చు. జల జీవ సంరక్షణకు ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఉపరితల జీవాలతోపాటు జల జీవాల మనుగడకు సైతం ముప్పు ఏర్పడుతోంది. జల జీవాల్లో అరుదైన జీవంగా గుర్తింపు పొందిన బ్లూ డాల్ఫిన్ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని తాజాగా వస్తున్న వార్తలే ఇందుకు నిదర్శనాలు. ఈ నేపథ్యంలో జల జీవ రాశుల సంరక్షణకు ఉద్దేశించిన కోర్సు ఫిషరీస్ సైన్స్ అండ్ ఆక్వా కల్చర్. జల జీవ రాశుల ఉనికి, పెంపకం, వాటి సంరక్షణ, భూగర్భ జలంలోని మొక్కలు సంబంధింత అంశాల అధ్యయనంతో కూడిన కోర్సు ఇది. చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తుల వాణిజ్యంలో ప్రపంచంలో భారతదేశం మూడో స్థానంలో నిలిచిన నేపథ్యంలో ఈ కోర్సు పూర్తయితే అవకాశాలకు కొదవలేదు. దేశంలో అధికంగా మాస్టర్స్ స్థాయిలోనే ఈ కోర్సు అందుబాటులో ఉంది. మన రాష్ట్రంలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ బ్యాచిలర్ స్థాయిలో ఫిషరీస్ సైన్స్ అండ్ ఆక్వాకల్చర్, పీజీ స్థాయిలో ఆక్వా కల్చర్, ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీ స్పెషలైజేషన్లను అందిస్తోంది. అవకాశాలు: ఫిషరీ ఫార్మ్, హేచరీ మేనేజ్‌మెంట్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్‌లలో ఉద్యోగావకాశాలుంటాయి. బయో డైవర్సిటీ ‘ప్రత్యేకంగా’... బయో డైవర్సిటీ, సంరక్షణకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో నేరుగా బయో డైవర్సిటీ స్పెషలైజేషన్‌తో పలు ఇన్‌స్టిట్యూట్‌లు పీజీ కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. జీవ జాతుల సంరక్షణ, నిర్వహణ, సహజ వనరుల సుస్థిర వినియోగం వంటి అంశాలపై శిక్షణ ఉంటుంది. పర్యావరణ సిద్ధాంతాలు, పద్ధతులపై శాస్త్రీయ దృక్పథంతో తర్ఫీదునిస్తారు. బయో డైవర్సిటీ విధి విధానాలు, జాతుల భావనలు, జీవ వైవిధ్యం, సంరక్షణ, జంతు సంరక్షణ మార్గాలు వంటి అంశాలపై శిక్షణనిచ్చే విధంగా ఈ కోర్సులకు రూపకల్పన జరిగింది. ప్రస్తుతం త్రిపుర యూనివర్సిటీ, పాట్నా యూనివర్సిటీ, గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలు ఎమ్మెస్సీ బయో డైవర్సిటీ స్పెషలైజేషన్ కోర్సులను అందిస్తున్నాయి. అస్సాం యూనివర్సిటీ ఏడాది వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్ బయో డైవర్సిటీ కన్జర్వేషన్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇటీవలే ఇగ్నో బయోడైవర్సిటీలో ఆన్‌లైన్ ప్రోగ్రాంను ప్రారంభించింది. micro biology సూక్ష్మ జీవశాస్త్రం(మైక్రో బయాలజీ)...... మహా సముద్రం లాంటి జీవశాస్త్రంలో ఒక భాగం. మనిషి కంటికి కనిపించని అతి సూక్ష్మ జీవుల అధ్యయనమే.. సూక్ష్మ జీవశాస్త్రం. భూగోళంపై లెక్కలేనన్ని సూక్ష్మజీవులు ఆవాసం ఏర్పరచుకున్నాయి. వాటిలో మనిషికి శత్రువులు, మిత్రులు.. ఉపయోగపడేవి, అప కారం చేసేవి.. రెండూ ఉన్నాయి. శత్రు జీవు లను నిర్మూలించాలి. మిత్ర జీవులను కాపా డుకోవాలి. వాటిని అనుకూలంగా మార్చు కొని, జీవితాన్ని మరింత సుఖవంతంగా మార్చుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించు కోవాలి. ఇవన్నీ చేసేవారే.. మైక్రో బయాల జిస్ట్‌లు. మంచి వేతనంతోపాటు పరిశోధనల ద్వారా సమాజానికి సేవ చేసేందుకు అవకాశం కల్పించే కెరీర్.. మైక్రో బయాలజిస్ట్. ఐటీ ఇంజనీర్లకంటే అధిక వేతనాలు మైక్రో బయాలజీలో అగ్రికల్చరల్, సాయిల్, మెడికల్, ఎన్విరాన్‌మెంటల్, ఇండస్ట్రియల్, ఫుడ్ మైక్రోబయాలజీ తదితర ఉప విభాగాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశ విదేశాల్లో మైక్రో బయాలజిస్ట్‌లకు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. పర్యావరణం, మెడిసిన్, పబ్లిక్ హెల్త్, పేపర్, టెక్స్‌టైల్, లెదర్, ఆహారం.. తదితర పరిశ్రమల్లో వీరికి డిమాండ్ పెరుగు తోంది. పరిశోధనల్లో మంచి అనుభవం సంపా దించి, నైపుణ్యాలు పెంచుకున్న మైక్రో బయాల జిస్ట్‌లకు ఐటీ ఇంజనీర్ల కంటే అధిక వేతనాలు అందుతున్నాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. అవకాశాలు పుష్కలం మైక్రో బయాలజీ కోర్సును పూర్తిచేస్తే.. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, హెల్త్‌కేర్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఉద్యోగావకాశాలు దక్కించుకోవచ్చు. ఫుడ్ క్వాలిటీ ఆఫీసర్, పొల్యూషన్ కంట్రోలర్, ప్రొడక్ట్ ఇంజనీర్, ఫుడ్ టెక్నాలజిస్ట్, ఇండస్ట్రియల్ మైక్రో బయాలజిస్ట్, పాథాలజీ ల్యాబ్‌ల్లో సైంటిస్ట్, పేటెంట్ అటార్నీ, బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్, ల్యాబ్ టెక్నీషియన్.. తదితర కొలువులు అందుబాటులో ఉన్నాయి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్), డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశాలు లభిస్తున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీగా, పరిశోధకులుగానూ స్థిరపడొచ్చు. కొన్ని ప్రభుత్వ సంస్థలు మైక్రో బయాలజీలో పరిశోధనలు చేపట్టేందుకు యువ సైంటిస్ట్‌ల కోసం ఫాస్ట్‌ట్రాక్ ప్రాజెక్ట్‌లను ప్రవేశపెడుతున్నాయి. ప్రత్యేకంగా నిధులు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నాయి. అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత మైక్రో బయాలజీలో గ్రాడ్యుయేషన్ చదవొచ్చు. ఎంఎస్సీ, పీహెచ్‌డీ కూడా పూర్తిచేస్తే ఉద్యోగార్హతలు పెరుగుతాయి. వేతనాలు మైక్రోబయాలజీలో గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది. నైపుణ్యాలు పెంచుకుంటే కార్పొరేట్ సంస్థల్లో ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు భారీ వేతన ప్యాకేజీ పొందొచ్చు. మైక్రో బయాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు  ఉస్మానియా యూనివర్సిటీ వెబ్‌సైట్: www.osmania.ac.in  ఆంధ్రా యూనివర్సిటీ వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in  యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్‌సైట్: www.uohyd.ac.in  నాగార్జునా విశ్వవిద్యాలయం వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in  యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వెబ్‌సైట్: www.du.ac.in Vidya-Lether Technology ప్రాచీన కాలంలో జంతువుల చర్మాన్నే మనుషులు దుస్తులుగా ధరించేవారు. ఆధునిక యుగంలో రకరకాల వస్త్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. జంతు చర్మంతో రూపొందించిన వస్తువులను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. తోలుతో తయారు చేసిన పాదరక్షలు, బ్యాగులు, పర్సులు, బెల్ట్‌లు, రెయిన్ కోట్లకు మంచి డిమాండ్ ఉంది. తోలు వస్తువుల వాడకాన్ని హోదాకు చిహ్నంగా భావిస్తున్నారు. భారత్‌లో తోలు పరిశ్రమ వేగంగా అభి వృద్ధి చెందుతోంది. తోలు ఎగుమతుల ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరు తోంది. మనదేశంలో ప్రతిఏటా 2 బిలియన్ చదరపు అడుగుల ముడి తోలు ఉత్పత్తవు తోంది. ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకా శాలు పుష్కలంగా లభిస్తున్నాయి. లెదర్ టెక్నా లజీని కెరీర్‌గా ఎంచుకుంటే.. భవిష్యత్తుకు ఢోకా ఉండదని నిస్సందేహంగా చెప్పొచ్చు. అవకాశాలు ఎన్నెన్నో.. లెదర్ టెక్నాలజీ కోర్సులను చదివిన వారికి మెరుగైన అవకాశాలు దక్కుతున్నాయి. ప్రధానంగా తోలు శుద్ధి పరిశ్రమల్లో లెదర్ టెక్నాలజిస్టుల అవసరం ఎక్కువగా ఉంది. మనదేశంలో హైదరాబాద్, చెన్నై, ఆగ్రా, కాన్పూర్, జలంధర్, కోల్‌కతా, ముంబై తదితర నగరాల్లో తోలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. లెదర్ గూడ్స్, లెదర్ గార్మెంట్స్ కంపెనీలు లెదర్ టెక్నాలజిస్టులను నియమించుకుంటు న్నాయి. లెదర్ కెమికల్స్ కంపెనీల్లోనూ అవకాశాలుంటాయి. దేశ విదేశాల్లో తోళ్ల వ్యాపారం నిర్వహించే సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు. ఈ రంగంలో కొంత అనుభవం సంపాదించిన తర్వాత సొంతంగా లెదర్ ఫినిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే అధిక ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. తగిన ఆసక్తి ఉంటే యూనివర్సిటీ లు/కళాశాలల్లో ఫ్యాకల్టీగా కూడా స్థిరపడొచ్చు. టెక్నాలజీని అప్‌డేట్ చేసుకోవాలి లెదర్ టెక్నాలజిస్టుగా రాణించాలంటే.. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, శ్రమించే తత్వం, నాయకత్వ లక్షణాలు ఉండాలి. తోలు శుద్ధి పరిశ్రమలు సాధారణంగా జనావాసాలకు దూరంగా ఏర్పాటవుతాయి. ఇందులో రసాయనాల వినియోగం ఎక్కువ. కాబట్టి అక్కడ పనిచేసేందుకు సిద్ధపడాలి. లెదర్ టెక్నాలజిస్టులకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బయోటెక్నాలజీ, ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్‌పై బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అర్హతలు: లెదర్ టెక్నాలజీలో డిప్లొమా, బీటెక్, ఎంటెక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత డిప్లొమా/బీటెక్‌లో చేరొచ్చు. ఎంటెక్ కూడా పూర్తిచేస్తే మంచి అవకాశాలు ఉంటాయి. వేతనాలు: లెదర్ టెక్నాలజీలో బీటెక్ పూర్తిచేసిన వారు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం అందుకోవచ్చు. తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా వేతనం పెరుగుతుంది. లెదర్ టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు  గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ-గోల్కొండ, హైదరాబాద్  సెంట్రల్ లెదర్ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్ - చెన్నై వెబ్‌సైట్: www.clri.org  అన్నా యూనివర్సిటీ-చెన్నై వెబ్‌సైట్: www.annauniv.edu  వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ-కోల్‌కతా వెబ్‌సైట్: www.wbut.ac.in  హర్‌కోర్ట్ బట్లర్ టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్-కాన్పూర్ వెబ్‌సైట్: www.hbti.ac.in విదేశాల్లోనూ అవకాశాలు ‘‘పాస్.. ఫెయిల్‌తో సంబంధం లేకుండా మెరుగైన కెరీర్‌ను అందించే కోర్సులు... లెదర్ టెక్నాలజీ, ఫుట్‌వేర్ టెక్నాలజీ. మూడున్నరేళ్ల కోర్సు సమయంలో ఏడాదిపాటు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తయ్యాక ప్రారంభ వేతనం రూ.10వేల వరకూ ఉంటుంది. మనదేశంతోపాటు విదేశాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. లెదర్ టెక్నాలజీ కోర్సులను అభ్యసిస్తే మంచి వేతనంతో కెరీర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు

విద్యా రుణాలు- అరుణ్‌ కుమార్‌ మరపట్ల-By Arun Kumar Marapatla

Vidya-05.02.2015 This Programme is telecasted in 6Tv telugu on 05.02.2015 Education Loans-Vidya- ఉన్నత విద్య (Higher Education).. వ్యక్తుల ప్రగతికే కాదు.. జాతి నిర్మాణానికి, పురోగతికి బలమైన పునాది. అలాంటి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆర్థిక స్తోమత లేకపోవడమనేది అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం.. అర్హులైన విద్యార్థులందరికీ విద్యా రుణాలు అందించాలని బ్యాంక్‌లను ఆదేశించింది. ఇలాంటి విద్యా రుణాల మంజూరుకయ్యే ఖర్చును మానవ వనరుల అభివృద్ధికి పెట్టే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే గత దశాబ్ద కాలంగా రుణాల మంజూరు ప్రక్రియను సరళీకృతం చేస్తూ వస్తోంది. రుణాలకు ఎవరు అర్హులు?  భారతదేశంలోగానీ, విదేశాల్లోగానీ ఉన్న విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన భారత జాతీయ విద్యార్థులకు టెర్మ్ లోన్ రూపంలో విద్యా రుణాలు మంజూరు చేస్తారు.  యూజీసీ/ఏఐసీటీఈ/ప్రభుత్వ అనుమతి పొందిన కళాశాల లేదా విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీటు సంపాదించిన విద్యార్థులు రుణాలకు అర్హులు.  ఐఐటీ/ఐఐఎం వంటి ఉన్నతస్థాయి విద్యా సంస్థల్లో డిగ్రీ లేదా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందిన వారు కూడా అర్హులు.  డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేదా షిప్పింగ్ శాఖ అనుమతి పొందిన ఏరోనాటికల్ కోర్సులు, పైలట్ శిక్షణ, షిప్పింగ్ కోర్సులను కూడా విద్యా రుణాలకు పరిగణనలోకి తీసుకుంటారు.  కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి పొందిన టీచర్ ట్రైనింగ్, నర్సింగ్ కోర్సులు రుణాలకు అర్హమైనవి.  దూరవిద్యా కోర్సులు, పార్ట్ టైం కోర్సుల్లో ప్రవేశించిన వారికి విద్యా రుణాలు మంజూరు చేయరు. ఎంత ఇస్తారు? విద్యార్థులు ప్రవేశం పొందే విద్యాసంస్థల్లో చెల్లించాల్సిన ట్యూషన్ ఫీజు, లేబొరేటరీ ఫీజు, పరీక్ష ఫీజు, యూనిఫాం, పుస్తకాలు, చదువుకు అవసరమైన ఉపకరణాలు, అవసరమైతే కంప్యూటర్ (ట్యూషన్ ఫీజులో 20 శాతానికి మించకుండా), కాషన్ డిపాజిట్/రిఫండబుల్ డిపాజిట్ (ట్యూషన్ ఫీజులో పది శాతానికి మించకుండా)లకు అయ్యే మొత్తాన్ని విద్యా రుణం మంజూరు చేసేందుకు పరిగణనలోకి తీసుకుంటారు. రూ. 50 వేల వరకు ద్విచక్ర వాహనం కొనుగోలును విద్యారుణంగా పరిగణిస్తారు. చదువు పూర్తిచేసేందుకు అవసరమైన ప్రాజెక్ట్ వర్క్, స్టడీ టూర్‌లకు అయ్యే ఖర్చులను కూడా మొత్తం ఖర్చులో కలపవచ్చు.  చదువుకోసం విదేశాలకు వెళ్లేవారు ప్రయాణ ఖర్చులను రుణం మొత్తంలో భాగంగా చూపించవచ్చు. విద్యార్థి కుటుంబంతో కలిసి ఉండకుండా వేరే ఊరిలో ఉండాల్సి వస్తే హాస్టల్ ఖర్చులు లేక సొంతంగా ఉండేందుకు అయ్యే ఖర్చులన్నీ చదువుకు అయ్యే ఖర్చుగానే పరిగణించి ఆ మేరకు రుణాన్ని మంజూరు చేస్తారు.  భారతదేశంలో చదువుకైతే రూ. 10 లక్షల వరకు, విదేశాల్లో చదువుకైతే రూ. 30 లక్షల వరకు విద్యా రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణాలకు ప్రాసెసింగ్ చార్జీలు ఉండవు. ఆషామాషీగా దరఖాస్తు చేసే విద్యార్థులను నిరుత్సాహ పరిచేందుకు విదేశాల్లో చదువుకోసం రుణాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల నుంచి రూ.5 వేలు డిపాజిట్ కట్టిస్తారు. రుణం తీసుకునేటప్పుడు ఆ డిపాజిట్‌ను వారి మార్జిన్‌గా పరిగణిస్తారు. ఏ కారణం వల్లనైనా రుణం మంజూరయ్యాక తీసుకోకుంటే ఆ డిపాజిట్‌ను ప్రాసెసింగ్ చార్జీగా పరిగణించి తీసుకుంటారు. ఎప్పుడు తిరిగి చెల్లించాలి? చదువు పూర్తయ్యాక ఒక సంవత్సరం లేక ఉద్యోగం వచ్చాక ఆర్నెల్లు.. ఈ రెండింటిలో ఏది ముందు జరిగితే అప్పటి నుంచి రుణ చెల్లింపులు ప్రారంభించాలి. చదువుకునే సమయంలో తల్లిదండ్రులు ప్రతినెలా క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు వడ్డీ కట్టినట్లయితే వడ్డీలో 1 శాతం తగ్గిస్తారు. రుణ పరిమాణాన్ని బట్టి 11.55 శాతం నుంచి 13.55 శాతం వరకు వడ్డీని సాలీనా వసూలు చేస్తారు. ఈ వడ్డీ రేట్లు స్థిరంగా ఉండవు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలకనుగుణంగా మారుతూ ఉంటాయి.  విద్యా రుణాలపై తిరిగి చెల్లించే వడ్డీ మొత్తానికి సెక్షన్ 80 (ఈ) కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. 2.3.2009 తర్వాత మంజూరైన రుణాల్లో మహిళా విద్యార్థులకు ఉపయోగించిన రుణాలకు 0.5 శాతం వడ్డీ తగ్గింపు వర్తిస్తుంది.  నాలుగు లక్షల రుణం వరకు మార్జిన్ అవసరం లేదు. అంటే చదువుకి అవసరమైన మొత్తం నాలుగు లక్షలకు మించకుంటే మొత్తం డబ్బును రుణంగా పొందవచ్చు. అంతకుమించితే మాత్రం భారత్‌లో చదువుకు 5 శాతం, విదేశాల్లో చదువుకు 15 శాతం మార్జిన్ భరించాల్సి ఉంటుంది.  రూ. నాలుగు లక్షల వరకు విద్యా రుణాలకు విద్యార్థి, తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు కలిసి సంబంధిత డాక్యుమెంట్లపై సంతకాలు చేస్తే సరిపోతుంది. ఎలాంటి కొల్లేటరల్ సెక్యూరిటీ అవసరం లేదు. రూ. 4 లక్షల నంచి రూ. ఏడున్నర లక్షల వరకు పై ఇద్దరితో పాటు ఎవరైనా హామీదారుగా ఉంటే సరిపోతుంది. ఇంకెలాంటి కొల్లేటరల్ అవసరం లేదు.  ఏడున్నర లక్షలకు పైన రుణాలకు మాత్రం భూమి, భవనాలు వంటి కొల్లేటరల్ సెక్యూరిటీ అవసరం.  ఏడున్నర లక్షల లోపు రుణాలను 5.7 సంవత్సరాల వ్యవధిలోనూ, అంతకు మించిన రుణాలను 12 ఏళ్ల వ్యవధిలోనూ తిరిగి కట్టాలి. సమర్పించాల్సిన డాక్యుమెంట్లు: విద్యా రుణాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన పత్రాల గురించి తెలుసుకుందాం. చదవదలచుకున్న విద్యా సంస్థలో ప్రవేశం కల్పించే ఉత్తరం, పదో తరగతి నుంచి అన్ని పరీక్షల మార్కుల పత్రాలు, కాలేజీలో కట్టాల్సిన ఫీజుల వివరాలు, హాస్టల్లో కట్టాల్సిన డబ్బు వివరాలు, 2 పాస్‌పోర్ట్ ఫొటోలు (విద్యార్థి/తల్లి/తండ్రి/హామీదారు), పాన్ కార్డు (విద్యార్థి, తల్లి/తండ్రి, గత ఆర్నెల్ల బ్యాంక్ స్టేట్‌మెంట్స్, గత రెండేళ్ల ఐటీ రిటర్న్‌లు, స్టేట్‌మెంట్ ఆఫ్ ఎసెట్స్ అండ్ లయబిలిటీస్, ఆదాయపు రుజువు (ప్లే స్లిప్పులు/ఫారం 16 వంటివి) జతపరిచి రుణ దరఖాస్తు ఇవ్వాలి. కేవైసీకి సంబంధించి ఐడీ రుజువు, అడ్రస్ రుజువులు జతపర్చాలి.  కొన్ని సందర్భాల్లో రుణం తీసుకొని చదివిన చదువు పూర్తయ్యాక, మరింత మంచి ఉద్యోగావకాశాల కోసం ఇంకా ఉన్నత విద్య చదవాలనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో అదే బ్యాంక్ నుంచి రెండో విద్యారుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాంటి వాటిని టాప్ అప్ రుణాలుగా వ్యవహరిస్తారు. రెండో రుణానికి సంబంధించిన చదువు పూర్తయ్యే వరకు మొదటి రుణానికి సంబంధించిన తిరిగి చెల్లింపును వాయిదా వేస్తారు. రెండో కోర్సు పూర్తయ్యాక రెండు రుణాలూ ఒకేసారి తిరిగికట్టడం ప్రారంభించవచ్చు. Digital Literacy-Vidya ప్రపంచం మొత్తం డిజిటల్ యుగం దిశగా దూసుకెళ్తోంది. అందివస్తున్న సాంకేతికత, చౌక ధరలకే లభ్యమవుతున్న ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్‌తో నవతరం డిజిటల్ వైపు మొగ్గుచూపుతోంది. రాబోయే కాలంలో విద్య, ఉద్యోగ సంబంధిత అంశాలతోపాటు ప్రభుత్వ పథకాలు, దైనందిన కార్యకలాపాలను అధిక శాతం డిజిటల్ మాధ్యమమే శాసించే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అందరూ సాంకేతిక సాధికారత సాధించేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమమే.. నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్(ఎన్‌డీఎల్‌ఎం). తద్వారా పట్టణాలు, గ్రామాల్లోని యువత ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు. 2015 చివరి నాటికల్లా 10 లక్షల మందికి డిజిటల్ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఈ శిక్షణ ద్వారా ప్రయోజనాలపై ఫోకస్... డిజిటల్ లిటరసీ అంటే.. అందరూ కంప్యూటర్ పరిజ్ఞానం అనుకుంటారు. వాస్తవానికి కావాల్సిన సమాచారాన్ని ఉపయోగించడం, నిక్షిప్తం చేయడం, విశ్లేషించే క్రమంలో డిజిటల్ సాంకేతికత, కమ్యూనికేషన్ టూల్స్/నెట్‌వర్క్‌ను ప్రభావవంతంగా వినియోగించే సామర్థ్యాన్ని కలిగి ఉండడమే డిజిటల్ లిటరసీ. వివరంగా చెప్పాలంటే.. సంప్రదాయ కంప్యూటర్లతోపాటు పీసీ, ల్యాప్‌టాప్ వంటి వాటి వినియోగంపై అవగాహన, కంప్యూటర్‌కు సంబంధించిన ప్రాథమిక పరికరాలపై పనిచేసే నేర్పు, కంప్యూటర్ నెట్‌వర్క్స్, ఈ-మెయిల్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ వంటివి వాడే విధానంపై స్పష్టత, కొన్ని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ల వినియోగం వంటి అంశాల్లో నైపుణ్యాన్ని కలిగి ఉండటమే డిజిటల్ లిటరసీ. 2020 నాటికి.. ప్రపంచ డిజిటల్ ఎకానమీలో భారతదేశం అగ్రభాగాన నిలిచేలా నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ దోహదపడుతుంది. రూరల్, అర్బన్ ప్రాంతాల ప్రజలు సాంకేతికంగా సాధికారత సాధించేలా చూడడమే దీని ప్రధాన ఉద్దేశం. డిజిటల్ సాంకేతికతతో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, ఈ-గవర్నెన్స్ ప్రాజెక్ట్‌లలో ప్రజలు చురుగ్గా పాల్గొనేలా చూడడం కూడా మరో లక్ష్యం. అంతేకాకుండా దేశంలోని గ్రామ పంచాయితీలను కూడా డిజిటల్ మాధ్యమం ద్వారా అనుసంధానించే కార్యక్రమం సైతం కొనసాగుతోంది. ఈ క్రమంలో 2020 నాటికి ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా డిజిటల్ సంబంధిత అంశాల్లో నైపుణ్యం సాధించేలా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్‌ను ప్రారంభించారు. 18 నెలల కాలంలో 10 లక్షల మందికి దేశంలో వచ్చే 18 నెలల కాలంలో 10 లక్షల మందిని డిజిటల్ టెక్నాలజీలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డైటీ) ఏర్పాటు చేసిన సీఎస్‌సీ-ఎస్‌పీవీ కం పెనీతో ద నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) ఫౌండేషన్ చేతులు కలిపింది. ఈ మేరకు నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్(ఎన్‌డీఎల్‌ఎం) తొలి దశ లక్ష్యాన్ని సాధించే దిశగా ఇరు సంస్థలూ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. పీపీపీ పద్ధతిలో పబ్లిక్-ప్రైవేట్-పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో ఈ విభిన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలో సీఎస్‌సీ-ఎస్‌పీవీ పాఠ్యాంశాలను రూపొందిస్తుంది. నాస్కామ్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. దీని కోసం సైయంట్, కాగ్నిజెంట్, గూగుల్, ఇంటెల్ తదితర సంస్థలతో ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు కేంద్రాలు నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్‌లో భాగంగా.. నాస్కామ్.. జెన్సర్ టెక్నాలజీస్, డిజిటల్ ఎంపవర్‌మెంట్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ ఏడాది హైదరాబాద్, పుణెలలో కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో ఈ ఏడాది జూలైలో, పుణెలో ఈ నెల ఆరో తేదీన ప్రారంభించిన కేంద్రాల్లో దాదాపు 3 వేల మందికి శిక్షణనిస్తారు. ఇందులో ప్రతి కుటుంబంలో ఒక్కరైనా డిజిటల్ విభాగాల్లో నైపుణ్యం సాధించేలా డిజిటల్ లిటరసీ, జాబ్ ఓరియెంటెడ్ ఇంగ్లిష్ ప్రోగ్రామ్, డీటీపీ, యానిమేషన్ సాఫ్ట్‌వేర్ డిజైన్, బిజినెస్- ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగామ్స్, వివిధ సామాజిక సమస్యలకు సంబంధించి అవగాహన, చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇవి లెక్చర్ సెషన్, గ్రూప్ ప్రాజెక్ట్, మోటివేషన్ సెషన్స్‌గా ఉంటాయి డిజిటల్ లిటరసీ వీక్ నేషనల్ డిజిటల్ లిటరసీలో భాగంగా నాస్కామ్ తన భాగస్వామ్య కంపెనీలతో కలిసి సంయుక్తంగా డిసెంబర్ 8 నుంచి 12 వరకు డిజిటల్ లిటరసీ వీక్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా వాలంటీర్ల రూపంలో ఐటీ ఉద్యోగుల సేవలను వినియోగించుకుని ఈ అంశంపై అవగాహన కల్పించనుంది. 2012లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 25వేల మందికి కంప్యూటర్ బేసిక్ స్కిల్స్‌ను నేర్పించారు. నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ వెబ్‌సైట్: www.ndlm.in Criminology-Vidya- దేశంలో జనాభా పోటెత్తుతోంది. నేరాలు కూడా అదేస్థాయిలో పెరిగిపోతున్నాయి. మరోవైపు తీవ్రవాదం పంజా విసురుతోంది. ఉగ్రవాదం ఉరుముతోంది. వీట న్నింటితో ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతోంది. అంతిమం గా దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో నేర నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవస రం ఏర్పడింది. అందుకే క్రిమినాలజిస్ట్‌లకు డిమాండ్ పెరిగింది. దీన్ని కెరీర్‌గా మార్చుకుంటే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఆకర్షణీయమైన ఆదాయం మెండుగా ఉంటాయి. సవాళ్లతో కూడిన ఉత్సాహభరితమైన కెరీర్‌ను ఇష్టపడేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది. బ్యాంకులు, కార్పొరేట్ సంస్థల్లో కొలువులు క్రిమినాలజిస్ట్‌లు సమాజంలో నేరాలకు గల కారణాలు, నేరస్తుల స్వభావం, నేరాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పోలీసు, న్యాయ వ్యవస్థ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ, సెమినార్ల ద్వారా అవగాహన కల్పించాలి. క్రిమినాలజీ కోర్సులను పూర్తిచేసినవారు యూనివర్సిటీ/కాలేజీల్లో లీగల్ స్టడీస్, లా అండ్ సోషియాలజీ, క్రిమినాలజీ ఫ్యాకల్టీగా పనిచేయొచ్చు. నేడు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల కంపెనీలు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్లు నిపుణులైన క్రిమినాలజిస్ట్‌ల కొరత ను ఎదుర్కొంటున్నాయి. పర్యావరణ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘన వంటి వాటిపై విచారణ జరిపే సంస్థల్లో వీరికి అధిక డిమాండ్ ఉంది. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, పరిశోధనా సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. క్రిమినాలజీలో కార్పొరేట్ క్రైమ్, ఎన్విరాన్‌మెంటల్ క్రైమ్ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఆర్థిక నేరాలను అరికట్టేందుకు బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు కూడా క్రిమినాలజిస్ట్‌లను నియమించుకుంటున్నాయి. కార్పొరేట్ రంగంలో చేరితే అధిక వేతనాలు అందుకోవచ్చు. కావాల్సిన నైపుణ్యాలు:క్రిమినాలజిస్ట్‌కు విశ్లేషణాత్మక దృక్పథం అవసరం. ప్రతి విషయాన్ని తర్కబద్ధంగా ఆలోచించగలగాలి. డేటా కలెక్షన్, అనాలిసిస్‌పై మంచి పరిజ్ఞానం ఉండాలి. సైకాలజీ, సోషియాలజీపై అవగాహన పెంచుకోవాలి. కష్టపడి పనిచేసే గుణం ఉండాలి. ఒత్తిళ్లు, సవాళ్లను తట్టుకొని పనిచేసే నేర్పు చాలా ముఖ్యం. అర్హతలు: మన దేశంలో వివిధ విద్యాసంస్థలు క్రిమినాలజీలో అండర్‌గ్రాడ్యుయేట్(బీఏ/బీఎస్సీ), పోస్టుగ్రాడ్యుయేట్(ఎంఏ/ఎంఎస్సీ) కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైనవారు అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులో చేరొచ్చు. ఇందులో ఉత్తీర్ణత సాధించి, పోస్టుగ్రాడ్యుయేషన్‌లో చేరేందుకు అవకాశం ఉంటుంది. వేతనాలు: క్రిమినాలజిస్ట్‌లు తమ హోదాలను బట్టి వేతనాలు అందుకోవచ్చు. ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు పొందొచ్చు. ఆ తర్వాత పనితీరు, అనుభవం, పదోన్నతుల ద్వారా వేతనంలో పెరుగుదల ఉంటుంది కోర్సులను అందిస్తున్న సంస్థలు:  లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్(ఎన్‌ఐసీఎఫ్‌ఎస్)-న్యూఢిల్లీ వెబ్‌సైట్: nicfs.nic.in/  ఆంధ్రా యూనివర్సిటీ వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in  బెనారస్ హిందూ యూనివర్సిటీ వెబ్‌సైట్:  www.bhu.ac.in  లక్నో యూనివర్సిటీ వెబ్‌సైట్:  www.lkouniv.ac.in  యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వెబ్‌సైట్:  www.unom.ac.in Science Olympiods-Vidya దేశంలోని ప్రీ యూనివర్సిటీ స్థాయిలో బేసిక్ సైన్సెస్ పట్ల ఆసక్తి పెంచడంతోపాటు.. ఆయా సబ్జెక్టుల్లో ప్రావీణ్యతను పరీక్షించేందుకు ఉద్దేశించినవి నేషనల్ ఒలంపియాడ్స్. ఇందులో అర్హత సాధించిన వారికి అంతర్జాతీయంగా నిర్వహించే ఒలంపియాడ్స్‌లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఐఏపీటీ), హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్(హెచ్‌బీసీఎస్‌ఈ) ఆధ్వర్యంలో నేషనల్ ఒలంపియాడ్‌ను నిర్వహిస్తారు మొత్తం ఐదు విభాగాల్లో.. ఐదు దశలుగా ఒలంపియాడ్స్ ఉంటాయి. అవి.. నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్, ఇండియన్ నేషనల్ ఒలంపియాడ్ ఎగ్జామినేషన్స్, ఓరియంటేషన్ కం సెలక్షన్ క్యాంప్, ట్రైనింగ్ ఇండియన్ టీమ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఒలంపియాడ్స్, ఇంటర్నేషనల్ ఒలంపియాడ్స్. వీటిల్లో నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్‌ను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఐఏపీటీ) నిర్వహిస్తుంది. మిగతావిభాగాలను హెచ్‌బీసీఎస్‌ఈ పర్యవేక్షిస్తుంది. మొత్తం నాలుగు సబ్జెక్టుల్లో నేషనల్ ఒలంపియాడ్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. అవి.. ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ. పాఠశాల స్థాయిలోని ప్రతిభావంతులను కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో 2008-09 నుంచి జూనియర్ సైన్స్ విభాగాన్ని ప్రవేశపెట్టారు నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్: నేషనల్ ఒలింపియాడ్స్‌కు ఇది మొదటి దశ. ఒలంపియాడ్ ప్రోగ్రామ్స్‌పై అవగాహన కల్పించడంతోపాటు ఇందులో పాల్గొనే విద్యార్థుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ఈ దశను నిర్వహిస్తారు. ఐదు విభాగాల్లో ఉండే ఈ పరీక్షను ఆయా సబ్జెక్టులాధారంగా.. నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ ఫిజిక్స్(ఎన్‌ఎస్‌ఈపీ)/ఆస్ట్రానమీ(ఎన్‌ఎస్‌ఈఏ)/బయాలజీ(ఎన్‌ఎస్‌ఈబీ)/కెమిస్ట్ రీ(ఎన్‌ఎస్‌ఈసీ)/జూనియర్ సైన్స్(ఎన్‌ఎస్‌ఈజేఎస్)గా వ్యవహరిస్తారు. అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ: 12వ తరగతి/దిగువ తరగతులు చదువుతుండాలి. జూనియర్ సైన్స్: పదో తరగతి/దిగువ తరగతి చదువుతూండాలి సిలబస్: సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగా నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్స్(ఎన్‌ఎస్‌ఈఎస్) ను నిర్వహిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లలో సీబీఎస్‌ఈ 11, 12వ తరగతుల సిలబస్ ఆధారంగా ఆయా సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆస్ట్రానమీ కూడా సీబీఎస్‌ఈ 11, 12వ తరగతులాధారంగా సిలబస్ ఉంటుంది. కానీ ఇందులో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎలిమెంటరీ ఆస్ట్రానమీ సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. జూనియర్ సైన్స్ విభాగంలో.. సీబీఎస్‌ఈ పదో తరగతి స్థాయి సిలబస్ ఉంటుంది. ఇందులో సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ), మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి ఎగ్జామ్ ప్యాట్రన్: జ్ఞాపక శక్తికి కాకుండా.. విద్యార్థి స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా విధానం సబ్జెక్టును బట్టి వేర్వేరుగా ఉంటుంది. వివరాలు.. ఫిజిక్స్ పేపర్ మొత్తం 180 మార్కులకు ఉంటుంది. ఇందులో పార్ట్-ఎ,బి రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఎలో మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో 50 ప్రశ్నలు అడుగుతారు. తిరిగి పార్ట్-ఎ.. ఎ1, ఎ2 అనే రెండు సెక్షన్లుగా ఉంటుంది. ఎ1లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఎ2లో ఉండే 10 ప్రశ్నలకు ఇచ్చే ఆప్షన్స్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి. ఇందులో సరైన సమాధానాలన్నిటిని గుర్తించాలి. పార్ట్-బిలో 5-6 షార్ట్ ఆన్సర్ టైప్ కొశ్చన్స్/ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్ భాషలో ఉంటుంది (300/ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకుంటే హిందీ/స్థానిక భాషల్లోను నిర్వహిస్తారు.) కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్ విభాగంలో పరీక్షలను మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఇంగ్లిష్ భాషలో నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌లో 80 ప్రశ్నల చొప్పున ఉంటాయి. సమాధానాలను గుర్తించడానికి కేటాయించిన సమయం రెండు గంటలు. వివరాలకు: www.iapt.org.in రెండో దశ.. ఐఎన్‌ఓఎస్: మొదటి దశ.. ఎన్‌ఎస్‌ఈఎస్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశ.. ఇండియన్ నేషనల్ ఒలంపియాడ్ ఎగ్జామినేషన్స్ (ఐఎన్ ఓఎస్)కు ఎంపిక చేస్తారు. ఎన్‌ఎస్‌ఈఎస్‌లో ప్రతిభ చూపిన విద్యార్థుల్లో ప్రతి సబ్జెక్ట్ నుంచి 300 మంది చొప్పున విద్యార్థులను రెండో దశకు ఎంపిక చేస్తారు. ఐదు విభాగాల్లో ఉండే ఈ పరీక్షను ఆయా సబ్జెక్టులాధారంగా.. ఇండియన్ నేషనల్ ఫిజిక్స్ ఒలంపియాడ్ ఎగ్జామినేషన్/ఇండియన్ నేషనల్ కెమిస్ట్రీ ఒలంపియాడ్ ఎగ్జామినేషన్/ఇండియన్ నేషనల్ బయాలజీ ఒలంపియాడ్ ఎగ్జామినేషన్/ఇండియన్ నేషనల్ ఆస్ట్రానమీ ఒలంపియాడ్ ఎగ్జామినేషన్/ఇండియన్ నేషనల్ జూనియర్ సైన్స్ ఒలంపియాడ్ ఎగ్జామినేషన్‌గా వ్యవహరిస్తారు. మొదటి దశలో అనుసరించిన సిలబస్‌నే ఈదశలోను వినియోగిస్తారు. ప్రశ్నలు నాన్-కన్వెన్‌షన్ పద్ధతిలో ఉంటాయి. ప్రశ్నల క్లిష్టత అంతర్జాతీయ ఒలంపియాడ్ స్థాయిలో ఉంటుంది. బయాలజీ మినహా మిగతా విభాగాల్లో సమాధానాలను గుర్తించడానికి కేటాయించిన సమయం మూడు గంటలు. బయాలజీకి మాత్రం రెండు గంట ల్లోనే జవాబులను గుర్తించాలి. మూడో దశ.. ఓసీఎస్‌సీ: దీన్ని కీలక దశగా భావించవచ్చు. ఇందులో చూపిన ప్రతిభ ద్వారానే ఇంటర్నేషనల్ ఒలంపియాడ్స్‌లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించే విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ దశను ఓరియంటేషన్ కం సెలక్షన్ క్యాంప్ (ఓసీఎస్‌సీ)గా వ్యవహరిస్తారు. ఇందుకోసం ప్రతి సబ్జెక్టు నుంచి 35 మంది విద్యార్థులను ఓసీఎస్‌సీకి ఎంపిక చేస్తారు. జూనియర్ సైన్స్ విభాగం నుంచి మాత్రం 45 మందికి అవకాశం ఉంటుంది. ఓసీఎస్‌సీకి ఎంపికైన విద్యార్థులకు హెచ్‌బీసీఎస్‌ఈలో అత్యున్నత ప్రమాణాలతో రెండు నుంచి నాలుగు వారాల పాటు ఓరియెంటేషన్ క్యాంప్ ఉంటుంది. ఇందులో విద్యార్థులకు తమ సబ్జెక్టుల్లో సైద్ధాంతిక, ప్రయోగత్మక శిక్షణనిస్తారు. వివిధ ప్రయోగాలను సొంతంగా చేసే అవకాశం ఉంటుంది. సంబంధిత సబ్జెక్టుల్లో ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో ఓరియెంటేషన్ క్లాసులు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి తర్వాత దశకు అర్హత కల్పిస్తారు. ఈక్రమంలో ఫిజిక్స్, ఆస్ట్రానమీ నుంచి ఐదుగురు చొప్పున, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి నలుగురు చొప్పున, జూనియర్ సైన్స్ నుంచి 12 మంది విద్యార్థులకు తర్వాత దశకు ఎంపిక చేస్తారు. వీరికి పుస్తకాలు, క్యాష్ రూపంలో రూ.5 వేల మెరిట్ అవార్డులు ఇస్తారు. అంతేకాకుండా ఆయా సబ్జెక్టుల్లో భారత్ తరపున అంతర్జాతీయ ఒలంపియాడ్స్‌లో పాల్గొంటారు. వీరికేకాకుండా థియరీ, ఎక్స్‌పెరిమెంటల్ పరంగా ప్రతిభ చూపిన ఇతర విద్యార్థులకు బహుమతులను కూడా అందజే స్తారు. ట్రైనింగ్ ఇండియన్ టీమ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఒలంపియాడ్స్: అంతర్జాతీయ ఒలంపియాడ్స్‌కు సన్నద్ధం చేసేలా విద్యార్థుల శిక్షణ కోసం ఈ దశను ఉద్దేశించారు. ఇందులో హెచ్‌బీసీఎస్‌ఈ ఫ్యాకల్టీలు, శాస్త్రవేత్తలతోపాటు ఆయా సబ్జెక్టులకు సంబంధించి ప్రముఖ సంస్థల డెరైక్టర్లు, నిపుణుల కూడా పాల్గొంటారు. ప్రత్యేక ల్యాబొరేటరీలను కూడా ఏర్పాటు చేస్తారు. కెమిస్ట్రీ, బయాలజీకి రెండు వారాలపాటు, ఫిజిక్స్ రెండు వారాల కంటే ఎక్కువ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్ విభాగాలకు వారం రోజుల పాటు శిక్షణనిస్తారు ఇంటర్నేషనల్ ఒలంపియాడ్స్: అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు విద్యార్థుల ముందు తామ ప్రతిభాపాటవాలను నిరూపించుకోవడానికి భారతీయ విద్యార్థులకు ఇది చక్కని అవకాశం. విద్యార్థులతోపాటు ఒలంపియాడ్స్‌కు వెళ్లే టీమ్‌లో మార్గదర్శకం చేయడానికి ఉపాధ్యాయులు, సైంటిఫిక్ ఆబ్జర్వర్ ఉంటారు. ఫిజిక్స్, ఆస్ట్రానమీలలో ప్రతి జట్టు నుంచి ఐదుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు, సైంటిఫిక్ ఆబ్జర్వర్ ఉంటారు. బయాలజీ, కెమిస్ట్రీ ప్రతి జట్టు నుంచి నలుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు, సైంటిఫిక్ ఆబ్జర్వర్ ఉంటారు. జూనియర్ సైన్స్ విభాగంలో 12 మంది విద్యార్థులు(6 గురు చొప్పున రెండు జట్లు), ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటారు. Animal Trainer ఇంట్లో కుక్కలు, పిల్లులు వంటి జంతువులను పెంచుకోవడం చాలామందికి అభిరుచి, అలవాటు. ఇవి యజమానుల పట్ల విశ్వాసపాత్రంగా మెలుగుతాయి. వారికి రక్షణ కల్పిస్తాయి. ఇంట్లో పెంపుడు జంతువులు ఉండడం సమాజంలో ఒక హోదాగా మారింది. ఇక పోలీసు, రక్షణ శాఖలో జాగిలాలు అందిస్తున్న సేవలు తెలిసినవే. జంతువులను మచ్చిక చేసుకోవడం అనాదిగా ఉన్నదే. జంతువులను పెంచుకోవాలంటే మొదట వాటికి తగిన శిక్షణ ఇవ్వాలి. శిక్షణ పొందినవే.. యజమానులు చెప్పినట్లు నడుచుకుంటాయి. క్రమశిక్షణతో మెలుగుతాయి. ఇలాంటి వాటికే మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంటుంది. జంతువులకు శిక్షణ ఇచ్చే నిపుణులే.. యానిమల్ ట్రైనర్లు. ఆధునిక కాలంలో పెట్స్ సంస్కృతి విస్తరిస్తుండడంతో ట్రైనర్లకు అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా లభిస్తున్నాయి. విదేశాల్లో ఎప్పటినుంచో ఆదరణ పొందుతున్న ఈ కెరీర్.. భారత్‌లోనూ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. యానిమల్ ట్రైనింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటే ఉపాధికి ఢోకా ఉండదని ఘంటాపథంగా చెప్పొచ్చు. సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో.. జంతు శిక్షకులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. పోలీసు, రక్షణ శాఖలో, వెటర్నరీ క్లినిక్స్, పెట్ షాప్స్, జంతు ప్రదర్శనశాలలు, యానిమల్ షెల్టర్స్, వైల్డ్‌లైఫ్ పార్కులు, రిజర్వ్‌లు, పరిశోధనా కేంద్రాలు, సర్కస్‌ల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. విదేశాల్లో అయితే సినిమాలు, టీవీ కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనలు, ప్రింట్ యాడ్స్‌లోనూ యానిమల్ ట్రైనర్ల సహాయం తీసుకుంటున్నారు. ఆకర్షణీయమైన వేతనాలు అందజేస్తున్నారు. జంతువులతో సంబంధం ఉన్న ప్రతిరంగంలోనూ వీరికి అవకాశాలుంటాయి. సొంతంగా జంతువులకు శిక్షణ ఇచ్చి, వాటిని విక్రయించుకోవచ్చు. కావాల్సిన నైపుణ్యాలు: యానిమల్ ట్రైనర్లకు ప్రాథమికంగా జంతువుల పట్ల అభిమానం, వాటిని ప్రేమించే గుణం ఉండాలి. సమయానుసారంగా జంతువుల ప్రవర్తనను అర్థం చేసుకొని తదనుగుణంగా వ్యవహరించే నేర్పు అవసరం. సమస్యలను పరిష్కరించే నైపణ్యం కావాలి. శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. స్వయం నియంత్రణ అవసరం. కోపతాపాలకు, ఆవేశానికి దూరంగా ఉండాలి. వివిధ జంతువుల ప్రవర్తన వేర్వేరుగా ఉంటుంది కాబట్టి ఓపిక, సహనంతోపనిచేయగలగాలి. అర్హతలు: మనదేశంలో యానిమల్ ట్రైనర్‌గా మారేందుకు ఎలాంటి విద్యార్హతలు, నియమ నిబంధనలు లేవు. అయితే, కనీసం ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులై ఉండడం మంచిది. అమెరికా, యునెటైడ్ కింగ్‌డమ్(యూకే), ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో యానిమల్ సైన్స్, యానిమల్ బిహేవియర్, బయాలజీ, జువాలజీ, మెరైన్ బయాలజీ, సైకాలజీ కోర్సులను చదివినవారు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ కోర్సులను పలు యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. వేతనాలు: యానిమల్ ట్రైనర్‌కు ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం లభిస్తుంది. ఈ రంగంలో అనుభవం, పనితీరును బట్టి ఆదా యం ఉంటుంది. నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదించే ట్రైనర్లు కూడా ఉన్నారు. విదేశాల్లో ఇంకా అధిక వేతనాలు అందుతాయి. శిక్షణ, సేవలు అందిస్తున్న సంస్థలు:  కమాండో కెన్నెల్స్-హైదరాబాద్ వెబ్‌సైట్: www.commandokennels.com/  యూనివర్సిటీ ఆఫ్ లింకన్. వెబ్‌సైట్: www.lincoln.ac.uk  ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ వెబ్‌సైట్: www.anglia.ac.uk/ruskin/en/landing.html  యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్. వెబ్‌సైట్: www.chester.ac.uk  ద సెంటర్ ఆఫ్ అప్లయిడ్ పెట్ ఎథాలజీ వెబ్‌సైట్: www.coape.org అరుణ్‌ కుమార్‌ మరపట్ల-By Arun Kumar Marapatla

Tuesday, May 26, 2015

దేహ రాగం


తెలిమంచు పరదాల కౌగిట్లో
గడ్డిపరకల గుబురు గూడుల్లో
నులివెచ్చగ ఒదిగిపోయిన
తేనె పిట్టల జంట
హమ్ తుమ్

నీరెండ పోగుల ముద్దులింతలకి
నది చేసే వెచ్చనలల చప్పుడు
గాజుల గలగలలు
నువ్వే....
చిలువమేతల చిలిపి స్పర్శలకి
చికిలించిన చూపుల్లో నవ్వు
నీ మౌన భాష..
ప్రవాహా వయ్యారానికి
నర్తించే తెరచాపనావలం
హమ్ తుమ్
- అరుణ్ మరపట్ల

వీధి



వీధి

జామ చెట్టు గుబుర్ల మధ్య
తాంబూలమేసిన మరుతేజి

మందార చాపానికి కట్టిన
వరికంకి దుబ్బులకోసం
వచ్చే గిజిగాడు

తుమ్మముల్లుకి తాటాకు రెక్కల్ని
పంకాగా గుచ్చి
పరుగులెత్తిన వీధులు

తాటిముంజెల రథంతో
రేసులాడిన వీధులు

దుర్భిణితో వేసే సినిమాకి
ఫిలిం కట్టలకోసం
మేమంతా ఎగబడిన
వీధి మొగదలి 
బ్రహ్మం కొట్టు

చింత చెట్టు రొబ్బలకి కట్టిన
అరల ముంతల్ని
కాటిబెల్లతో
గురిపెట్టి కొట్టిన 
దెబ్బలు

వేసవి పొద్దుల్లో
చుక్కల్ని లెక్కిస్తూ
ఆరుబయట పర్యంకం మీది నిద్ర

తట్లీతో గోళీని కొట్టలేక
ఉట్లీ పెట్టేసి
సయాముల కన్నేలాట

జారిపోయే నిక్కరుని ఎగదోస్తూ
ఫైవ్ మార్క్ అగ్గిపెట్టె బచ్చాలకు
తిరిగిన రికామీ తిరుగుళ్లు

పందిరిపై జమ్ముగడ్డికి
తిరుగాడిన కోటిమెరక గట్లు
చేసిన కోనేటి స్నానాలు

వాన పడ్డాక వచ్చిన
మద్దేనపు సెలవుతో
బడిలో తిప్పిన
మట్టి బొంగరాలు

ఇవన్నీ
చక్కటి ఊరేకాదు
చిక్కటి జ్ఞాపకాలు కూడా


నట్టింట్లో పడకేసిన
టీవీల గోల తప్ప
ఇప్పుడీ 
ఆటల్లేవు

-అరుణ్ మరపట్ల
Arun Kumar Marapatla

Friday, January 25, 2013

కలారమి
రసాత్మకవాక్యంలో
విషం పూసిన అక్షరాలు

పేరాగ్రాఫుల రజనుల్లో
విషపు చుక్క
కంట్లో నలుసై
మనసుని విరిచేసింది


వీనమ్ పుస్తకాన్ని
కుబుసమై అంటుకున్న
బూజుపట్టిన అధ్యాయాలు


 ఈ స్వపాన్ని ధ్వసించడానికి
ఏ కలలనాయుధం చేసుకోవాలో!!




అరుణ్‌ కుమార్‌ మరపట్ల
Arun Kumar Marapatla



Friday, March 25, 2011

ఓ ప్రభాత వేళ

కిటికీ రెక్కలు తీయగానే
చల్లగా తాకింది వేపగాలి
చెప్పాపెట్టకుండా వచ్చేసింది
వేసవివాన
చెట్టుమీద ఒంటరిగా తేనెపిట్ట
చెడ్డీలేకుండా చిన్నపిల్లాడు
వేపపూలతో అక్షింతలేయించుకుంటున్నారు
కార్మబ్బులతో ఈవేళ సూరీడు సెలవు


అరుణ్‌ కుమార్‌ మరపట్ల
Arun Kumar Marapatla